సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను అడ్డుకుంటాం

  • బయ్యారం ఉక్కుపైనా కేంద్రం తీరు దారుణం
  • స్కైవేల నిర్మాణానికి సహకరించని కేంద్రం
  • ధరణి రద్దు, ప్రగతిభవన్‌ ‌బద్దలు….ఇదేనా కాంగ్రెస్‌ ‌పార్టీ విధానం
  • అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
  • ‌ఫార్మాసిటీపై తప్పుడు ఆరోపణలు తగవు ..
  • రోడ్లపై మతపరమైన కట్టడాల తొలగింపుకు చట్టంపై పరిశీలిస్తామని వెల్లడి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : సింగరేణిని ప్రయివేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణిని కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్‌ ‌లేఖ రాశారు. నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కానీ నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నాం..అందులో పాల్గొనచ్చని కేంద్రం చెప్పిందని కేటీఆర్‌ ‌తెలిపారు. సింగరేణిని కార్మికులందరికీ మాటిస్తున్నాం..అవసరమైతే ఎంత దూరమైనా పోతాం. సింగరేణిని ప్రయివేటుపరం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం కుట్రను భగ్నం చేస్తామన్నారు.
2004 నుంచి 2014 వరకు ఇసుకపై రూ. 39 కోట్ల 40 లక్షల ఆదాయం వొచ్చిందని, కాంగ్రెస్‌ ‌హయాంలో సంవత్సరానికి 4 కోట్లు కూడా రాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో..ఇప్పుడు ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వొస్తుందని, ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. బయ్యారం విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పిందని, బయ్యారంలో స్టీల్‌ ‌నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కెటిఆర్‌ ‌మండిపడ్డారు. స్టీల్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, వరల్డ్ ఎకానమిక్‌ ‌ఫోరంలో కూడా జిందాల్‌, ‌మిట్టల్‌ ‌వారితో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించామని, కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.
స్కైవేల నిర్మాణానికి సహకరించని కేంద్రం…రోడ్లపై మతపరమైన కట్టడాల తొలగింపుకు చట్టంపై పరిశీలన ట్రాఫిక్‌ను నివారించేందుకు వేగంగా రహదారులు పనులు చేపట్టామని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. అలాగే ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రద్దీని తగ్గిస్తున్నామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా  సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్‌ ‌శాసనసభలో సమాధానం ఇచ్చారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలని అనుకున్నామని కానీ మోడీ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నామని, అయినా కలిసి రావడంలేదని కెటిఆర్‌ ‌మండిపడ్డారు. డిఫెన్స్ ‌భూముల కావడంతో తాము ముందడుగు వేయలేక పోతున్నామని కెటిఆర్‌ ‌తెలియజేశారు. రోడ్లపై ఉన్న మతపరమైన నిర్మాణాలు తొలగించే అధికారం కోసం చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ధరణి రద్దు, ప్రగతిభవన్‌ ‌బద్దలు….ఇదేనా కాంగ్రెస్‌ ‌పార్టీ విధానం : కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ శ్రీ‌ధర్‌ ‌బాబు ఆరోపణలపై కెటిఆర్‌ ‌ఫైర్‌
‌ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రంగా ఖండించారు. ధరణిని రద్దు చేయడం..ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్‌ ‌విధానామా? అని కేటీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్‌ ‌పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఫార్మాసిటీలో ఒక్క సెంటు భూమి కూడా అమ్మలేదన్నారు. లేనిపోని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. అంతకు ముందు స్పీకర్‌ ‌పోచారం కూడా పదేపదే శ్రీధర్‌ ‌బాబును హెచ్చరించారు. గత ఆరేండ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్టేష్రన్‌ అయ్యాయి. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరు.
ఎక్కదో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాద న్నారు. ధరణిని రద్దు చేస్తామని పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. ధరణిని రద్దు చేయడం పార్టీ విధానమే అయితే.. పార్టీ పరంగా చెప్పండి. ధరణి వల్ల రైతులకు ఏ లాభం లేదు.. రద్దు చేస్తామని చెప్పండి. కాంగ్రెస్‌ ‌హయాంలో లంచం లేకుండా రిజిస్టేష్రన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టినట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం అని శ్రీధర్‌ ‌బాబు చెప్పదలుచు కున్నారా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే మా విధానం అని ఆయన చెప్పదలుచుకున్నారా..? రెవెన్యూ వ్యవస్థలో లంచగొండితనం ఉండాలనేది వారి విధానం అయితే చెప్పమనండి. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదు. శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని కేటీఆర్‌ ‌సూచించారు. ఇకనైన వారి వైఖరి మార్చుకోవాలి అని కేటీఆర్‌ ‌సూచించారు.
ఫార్మాసిటీపై తప్పుడు ఆరోపణలు తగవు : శ్రీధర్‌బాబుకు కెటిఆర్‌ ‌కౌంటర్‌
‌ఫార్మా సిటీ భూములపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. ఫార్మా సిటీలో భూముల కొనుగోలు, విక్రయాలపై తప్పుడు ఆరోపణలు చేసిన శ్రీధర్‌ ‌బాబుపై కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఐ స్టాండ్‌ ‌కరెక్టెడ్‌ ఇఫ్‌ ఐయామ్‌ ‌నాట్‌ ‌రైట్‌ అని శ్రీధర్‌ ‌బాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌స్పందించారు. ఫార్మా సిటీలో భూములను రూ. 8 లక్షలకు కొని.. రూ. కోటి 30 లక్షలకు అమ్ముతున్నారని శ్రీధర్‌ ‌బాబు అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్‌ ‌కరెక్టెడ్‌ అని అందంగా ఇంగ్లీష్‌లో చెప్తే ఎలా? అని కేటీఆర్‌ అడిగారు.
చేసింది తప్పుడు ఆరోపణ.. ఉపసంహరించుకునేందుకు భేషజాలు ఎందుకు..? అని ప్రశ్నించారు. శ్రీధర్‌ ‌బాబు మంచి విద్యాధికుడు. రాజకీయాల్లో విమర్శ కోసమే విమర్శ..అసత్యాన్ని కూడా అందంగా, వినసొంపుగా చెప్తే అది సత్యమై పోతదన్నట్టు వారు మాట్లాడేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఫార్మా సిటీలో భూములను ఎకరాకు రూ. 8 లక్షల చొప్పున కొనుగోలు చేశారని, రూ. ఒక కోటి 30 లక్షలకు విక్రయించినట్లు శ్రీధర్‌ ‌బాబు మాట్లాడారు. ఒక్క ఎకరం కాదు ఒక్క సెంటు కేటాయించినట్లు నిరూపించగలరా..? అని శ్రీధర్‌ ‌బాబుకు కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. నిరూపించకపోతే క్షమాపణ చెబుతారా? అని అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *