సావులెవలియి? సంబురాలెవలియి?

తెలంగాణ రాష్ట్రం సాధించి పదేండ్ల యిందని సంబురాలు జేయబట్టె! పదేండ్లల్ల యేపాటి సంబుర మయిందని?యెవల్లకు సంబురమయిందని?  యెవలు సంబురంగ వున్నరని!? కండ్ల ముందు కనిపించే బిడ్డలు కండ్ల ముందే బుగ్గాయె!శీకాంతు , యాదయ్య , కిట్టయ్యలే గాదు,ఎంతమంది నీళ్ళు, నిధులు ,నియామకాల వచ్చే బతుకు తెలంగాణ కోసం వేల మంది ఇండ్లూ ,సదువులు కొలువులూ ఇడిశి ఉద్దెమంల దూకిండ్లు.సీమాంధ్రోళ్ళ లాటీలకు,తూటాలకు యెదురుబోయిండ్లు! గిసోంటివేలమంది అమరుల నెత్తుటితోని తడిశిన మన తెలంగాణా మట్టి మీద పదేండ్ల సంబురాలు జరుగబట్టె!నీళ్ళు,నిధులు,నియామకాల ఊసు లేదుగని,నియంత రాజ్జెమైతె మోపయింది.సావు నోట్లె తలకాయ పెట్టి మన రాజ్జెం తెచ్చిన అనేటి దొర, సావును లెక్కజేయక పానాలిచ్చిన వేల మంది వీరుల యాదెట్ల మరిశిండు? మరి గీ సంబురాలల్ల  అమరులకుటుం బాలజోలి జర్రంత సూత కానత్తలేదు. ఉద్దెమానికి అడ్డంబడ్డ సీమాంధ్ర పట్టెదార్లే తెలంగాణ రాజ్జెంల రాజులాయె!,మంత్రులాయె! ఉద్దెమమంటే త్యాగమనినమ్మి  అమరుల నెత్తురు బారిచ్చిన నేలమీదఉద్దెమ ద్రోహులు యెట్లా రాజ్జెమేల బట్టిండ్లు?మన వీరుల సావు, ఆ సావులందిచ్చేటి అమరత్వం ఇలువ పల్లెపల్లెన జనం గుండెలల్ల పైలం గున్నది.గద్దెక్కెంగనె ఎత్తిన గొంతులమీద గురి సూశి తుపాకులు పేల్చి లిశృతిలి తప్పిన నాడే దొర గురించి మంచిగ యెరుకాయె! సావు గురించి బుగులేం లేదు దొరా!ఎవలికైనా సావు ఒక్కపాలే అత్తది. గీ సావు సోయివుంటె సాలు.

తెలంగాణ రాజ్జెం కోసం సావు నోట్లె తలకాయ  పెట్టినంటివి! సావంటె యెరికేనా?సావుకు బుగులయి మడిమ తిప్పిన దొరా! జర్రిను, తీరొక్క సావులుంటయి. !సావు ముందెవలైన ఒక్కటే! యెవలికైనా తప్పేది కాదు.సావు యెందుకచ్చింది, సావు యేం జెప్ప బట్టింది! గి సోంటి సావులింకోతాప రాకుంట యేంజెయ్యాలె!అనేది జూడాలె! సావు గిట్ల బల్మీటికి సావైతె యెవలు జేబట్టచ్చె!?యెందుకచ్చెనో జూడాలె!సావంటె ఐదొద్దులు,పదొద్దులైనంక ఒడిశిబోయె దినాలు,వారాలు కాదుల్లా! అన్ని సావులు ఒక్క గాటనెట్లగడ్తం!? సావు మనిషిని మాయం జేత్తది గని ,మనిషి రూపును కండ్ల ముందుంచుతది!ముసలోళ్ళు,పడుసోళ్ళు,నడీడోళ్ళు జరంత ముందుగాల,లేకుంటె యెనుకశీరి.యెవుసం గిట్టక అప్పులై పానం తీసుకున్న సావైతె అయ్యో! అంటరు.టక్కర్లు గిట్నై పిడాత సత్తె, కోట్లాటలై పొడుసుకొనుట్ల సత్తె నూకలై పోయినాయిర బిడ్డా!అనంటరు. గీ నడ్మ కరోనా సావులు ఆగమాగం ,అడ్వడివి జేయబట్టె. సావుబుగులు తోని దేశవంత లాకుడవున్లంటిరి. రొండేండ్ల సంది సావులంటె కరోనా సావులే కానత్తానయి గని,ఇంకో సావులెందుకు కానత్తలేవు!? ఆకలి సావులు,రైతన్నల సావులు,కౌలు రైతుల సావులు,నౌకర్లు రాక సదువుకున్న పోరల్ల సావులు,అప్పుల తిప్పలై సావులు తీరొక్కసావులెందుకు కానత్తలేవు. మనం బిల్వకుంటచ్చే సావులు తిప్పలు యెవలికి జెప్పుకోలేక, మనం బిలిశి రమ్మంటె అచ్చే సావులుంటై.మన రాజ్జెం మనకచ్చినంక రైతు సావులే లేకుంట జేత్తమనె! కోటెకరాల పచ్చని పంటలు పండే మన తెలంగాణా బూములే  దేశానికింత బువ్వ బెడ్తయనె!వూర్లెకూర్లు మింగిన కాలేశ్వరం కాలవడ!ఎవలి తాడు తెంపేటి కాడ  కుండ బడ్తాందో యేందో! తెలంగాణాల యెవుసమంటె ‘‘సావు నోట్లె తలకాయ బెట్టుడు’’ తీరున్నది.

యవుసం బెట్టినంక దినాం సావేనాయె!నారు బోశిన కాన్నుంచి బత్తలు లారికెక్కేదాంకనా! కల్లాల్ల కండ్ల ముందే ఆగమాగం కాంటలేశేటోళ్ళు జేశే కతలు ఆసాముల పానాల మీదికి రాబట్టె!  పత్తులు బెడ్తె యేం కాలవడ్డది,! పల్లె పల్లెన ఇత్తనాలు ఫుజూల్‌ ‌గా ఇత్తననె! నేను బుట్టిందె అందుకయివు ంటదనె! చింతమడుగు కతలు పడ్తానవని అనుకోలే! బజాట్న దోకాబాజి ఇత్తనాలే దొర్కబట్టె పూతకు లేదాయె,కాతకు రాదాయె!కిందికి మీదికై బత్తాలెక్కిచ్చి, మార్కిట్లకు తెత్తె దరలు యెటమటం జేశేటాలకు చేశినప్పులు సూత తీరక పాయె! ఆన రాకుంటె తిప్పలేనాయె! బగ్గానలు గొడితె సుత తిప్పలేనాయె! యేహే! యెంత పాటి ఆన కావాల్నో కాంటేశి శెప్పేదేమన్న వున్నదాంటె! ఏ కాలం ముచ్చట ఆ కాలందే!ఆనలచ్చే కాలం దాని మానాన అదచ్చి పోతది.అత్తె తిప్పలేముంటది!, ఆనత్తె మాగ సంబురమేగని కోతలయి,నూర్పుల కాలంల గీ బాంచొత్‌ ‌వానలేందుల్లా! కల్లాలల్ల ఆరబోశిన అడ్లు,మక్కలు పురంగ తడిశి మొక్క మొలిశె!నీళ్ళతడిశిన దాన్నెం కొనె దిక్కు లేకవాయే! యేడాదంత యెదురు జూశే మామిడి రైతన్నల సావుకచ్చె! పిందెలన్ని రాలగొట్టిన రాల్ల వాన దంచి పాయె!కండ్ల ముందే పంట కొట్టుకపోతాంటె అప్పులెట్ల తీర్సుడ్రా రామా! అని నెత్తినోరు కొట్టుకో బట్టె!  గిసొంటప్పుడే సర్కార్‌ ‌పనితీరు యే పాటిదో యెరుకైతది!పతిపక్షాల జోరేపాటిదో కానత్తది!దేశవంత యేట్లబోయినా మనకాడ మాత్రం అవ్వల్‌ ‌దర్జా సర్కారున్నది. రాష్ట్ర వంత మునిగి ముద్దయింది, పట్నం,పల్లెనకుంట కొట్కవోవట్టినయి, యేంది రావులా!అని సర్కార్‌ అటిటు  బోయి అర్సుకుందావనేటి సోయిలేకుంటున్నది.

పిడుగుల బడవట్టె! పట్నాలల్ల రోడ్లకడ్డంగ చెట్లు అడ్డం తెగిబడ వట్టె! జనం అరగోస పడవట్టి సాయం కోసం జూడవట్టె!రైతులె ట్లున్నరు! పంటలేమైనయి!?ఎసొంటి రంధి, మా తిప్పలేందో జరంత సోయిసొక్కం లేకుంట మంత్రి సార్లంత ఇంట్ల మంచం సుతదిగుతలేరు.పాజెక్ట్ ‌ల కోసవని గుంజుకున్న బూముల తిప్పలేవూల్లె సుత తీరనే లేదు.దొరలప్పుడు జేశిందిదే,గిప్పుడు జేశేదీ అదే! దొరలు మారలే!దొరీర్కమూ మారలే!పెత్తనం పేరు మారిందంతే! బూముల లెక్కలు తిర్లమర్ల జేశి రాశిండ్లు, వందలెకురాల బూమి ఆగమాయె! యేడాది సంది తిర్గబట్టినా గని ఫాయిదా లేదాయె!. కౌలు రైతన్న తిప్పలింటె గుండెలవిశిపోతయి.యెంతగనం తిప్పలు వడ్డా దిగుబడి సరిగ్గా రాదాయె,కిందికో మీదికో కొస్సెల్లుతె ఇగదర రాదాయె!కౌలు రైతుకు బేంకు అప్పులియ్యదాయె!అడ్తీ సేట్లకాడి అప్పు లెక్కలైతె మిత్తిల మీద మిత్తిలై మిగిలేది యేముంటది?!గీ ఏడేండ్ల సంది బల్మీటికి జీవిడిశిన రైతుల్ల కౌలు రైతులే యెక్కువమందని  సర్కార్‌ ‌లెక్కలే జెప్పబట్టె! తెలంగాణ అచ్చింది, దొరలను యెంబటేసు కచ్చింది.బూముల దోపిడి మల్ల మోపుజేశింది.బూములప్ప జెప్పింది.బూముల లెక్కలుతిర్ల మర్ల జేశి పట్టదారులు యెవలంటె యెన్కబడచ్చిన పాత దొరలని జెప్పె!వందలేకురాలున్న దొరలకు రైతుబంధు రాబట్టె! కౌలు జేశేటోళ్ళకు సావులే మిగుల బట్టె! దేశానికి బువ్వ బెట్టె రైతు గోస వూల్లె పొంటి సావుడప్పోలిగె ఇనవడ్తాంది.     నీళ్ళు మనయే ,నిధులుమనయె!తెలంగాణచ్చినంక కొలువులన్ని మనయంటిరి. గీళ్ళింట్ల పీనుగెళ్ళ!.తెలంగాణచ్చిన కాన్నించి నౌకర్లెవరికిచ్చిన పాపాన బోలేదు.కలో గంజో తాగి పోరలను సదివిత్తివి. చేతికచ్చిన పోరలకు పదేండ్ల సంది నౌకర్లన్న ముచ్చట ఇనరాకపాయె!పయివేట్‌ ‌నౌకర్ల గలుపుకోని లచ్చ నౌకర్లిచ్చిన మంటిరి.ఆరేండ్ల సంది ఎసొంటి నౌకర్లు లేక సదువుకున్న పోరల్లు ఆగం గాబట్టిరి. వయసు దాటబట్టెగని నౌకర్లియకుంటె సదివిన సదువులు దండుగైతాండె!గొల్లోడు గొర్లుగాయాలె!మంగళోడు సవురం జేయాలె!బెస్తోడు శాపలు పట్టాలె!అనే కతలు జెప్పబట్టె! మరి నౌకర్లెవలు జెయ్యాలె!  యెవలు గాళ్ళ కులం పనులు జేసుక బతుకాలని జెప్పకనే జెప్పబట్టిన దొరీర్కం సదూకున్న పోరల్ల బతుకుల ఆగం జేయబట్టె!  కోట్ల గొర్లు,బర్లు,శెరువుల శాపలు గీ లెక్కలు జెప్పుడే గని నౌకర్ల మాటల్లెకపాయె!ఆరేండ్ల సంది కొలువుల్లేకపాయె!యాడాదికోతాప కొలువుల జాతరని జెప్పుడే గని కొసెల్లెని కతలు బడితిరి.లచ్చలల్ల కొలువులు మాయంజేశి వేలల్ల లెక్కలు జూపుతాంటిరి.

సదువులు సట్టుబండలు గాబట్టెనని బల్మీటికి జీవిడిశిన సదువుకున్న పోరల్ల సావులెందుకు కానత్తలేవుల్లా!      ‘‘తెలంగాణచ్చినంక కాంట్రాక్ట్ ‌నౌకర్లుండయి,వుంటెగన్క గవన్నింటిని పర్మినెంట్‌ ‌జెత్తననె’’! పర్మినెంట్‌ ‌జేసుడెందో గని వున్న కాంట్రాక్టు నౌకరోళ్ళను వేలమంది నౌకర్ల పీకి బజాట్నేశిండ్లు.కరోన కాలంల జరిన్ని నౌకర్లు అనామతుగ నింపిండ్లు! వయిసు పోరగాండ్లు మస్త్  ‌సంబురపడ్డరు. దొర రేపురేపు గీ నౌకర్లన్నింటిని పర్మినెంట్‌ ‌జేత్తరనుకునె!రేతిరన్న మాట పగటీలికి ఇచ్చుకపాయె!వున్నది లేనిది అన్ని బాయె! గీళ్ళు బజాట్నబడి లొల్లికి దిగిండ్లు, గని,బల్మీటికి సావులెరుకలె!సర్కార్‌ ‌మళ్ళో తాప గురుకులం నౌకర్లనె,గ్రూపుల నౌకర్లనె,గీ నౌకర్లో కొసెల్లక మునుపే ఓట్ల పండుగ పాట రాగమందుకుంటది!గీ పాటపాడుగాను,ఇంత జప్పున  ఓట్ల పండుగైపోతాదుల్లా! ఆటెంక యేమైతదో యెరికే గద’’
సావులతోని ఒరిగేదేం లేదు.కొట్లాట కొత్తదేం గాదు. ఎవలి త్యాగాలతోని తెలంగాణ రాజ్యమచ్చిందో గాళ్ళదే రాజ్యం.దొరీర్కాలు మాగనే నడిశినయి.గని జనందండు గట్టిన కాడ దొరా లేడు , దొరీర్కమూ లేదు.

–  ఎలమంద, తెలంగాణా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *