సాగునీటి వివక్షతపై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ రావు

 నేడు  ఆర్‌.విద్యా సాగర్‌రావు  వర్థంతి

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్‌ రావు ఉమ్మడి రాష్ట్రంలో తెలం గాణకు నీటి కేటాయింపుల విషయంపై జరిగిన అన్యాయం పై ఎలుగెత్తి చాటారు. నీటి పారుదల శాఖలో వివిధ పదవులలో, హోదా లలో పని చేసిన ఆయన, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు ప్రాజెక్టులు, నీటి కేటాయింపు లపై ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు ఇస్తూ సందేహాలను నివృత్తి చేసేవారు. సాగునీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన ఆధార సహితంగా, బహిర్గత పరిచి, ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను ప్రేరేపించడంలో, ఉద్యమ తెరాస పార్టీ అధినేతకు వెన్ను దన్నుగా ఉన్నారు. అలా కేసీఆర్‌కు ఉన్న అతి దగ్గర వ్యక్తులలో విద్యాసాగర్‌ రావు ఆంతరంగిక ముఖ్యులలో ఒకరై పోయారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తన పరి జ్ఞానంతో కొత్త ప్రాజెక్టుల రూప కల్పనలో ఆయన భాగస్వామ్యం విడదీయ జాలనిది, ఆయన పాత్ర నిజంగా మరువలేనిది..
‘‘జయశంకర్‌ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప తెలంగాణ మహాను భావుడు విద్యాసాగర్‌ రావు’’ అని కేసీఆర్‌ చేత ప్రశంసింప బడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన.
ఆర్‌. విద్యాసాగర్‌రావు (14 నవంబరు 1939-2017 ఏప్రిల్‌ 29)  తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన జాజిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రాఘవరావు దంపతులకు విద్యా వంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న స్థితి, వారి   కుటుంబంలో అందరికీ  చదువు పట్ల ఆసక్తి కలగడానికి హేతువైంది. వారి గ్రామంలో తొలి సారిగా మెట్రిక్యులేషన్‌ చేసిన వ్యక్తి రాఘవ రావు కాగా,  మొదటి పట్టభద్రులు రాఘవరావు పెద్ద కుమారుడు, మొట్ట మొదటి ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు విద్యాసాగర్‌రావు కావడం విశేషం.
విద్యాసాగర్‌రావు 1960లో హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వ విద్యాలయము నుండి ఇంజనీరింగ్‌ లో పట్టభద్రు లయ్యారు. 1979 లో రూర్కీ విశ్వ విద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) లో నీటి వనరుల అభివృద్ధి లో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. ఆయన 1983లో అమెరికా లోని కొలోరాడో స్టేట్‌ విశ్వ విద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరిం గులో డిప్లొమా పొందారు. ఆయన 1990లో ఢల్లీి విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో పట్టాను కూడా సంపాదించారు.

బీటెక్‌ పూర్తి అయిన వెంటనే క్యాంపస్‌లోని మహిళా కాలేజీ మెయింటెనెన్స్‌ ఇంజీనీరుగా ఉద్యోగంలో చేరారు. కళల పట్ల ఆసక్తి కలిగిన ఆయన, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా రాయటం, నాటకాలు వేయడం వంటి హాబీ లకు దూరం కాలేదు. అను దినం సాయంత్రం విధుల నిర్వహణ అనంతరం రవీంద్ర భారతికి వెళ్ళేవారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి, అనంతరం ఢల్లీికి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వేస్‌, నీటిపారుదల శాఖలో ఇంజ నీరుగా పనిచేశారు. ఢల్లీిలో ఉన్న సమయంలో సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసు కున్నారు. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందాక, తరువాత తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. దాదాపు 34 సంవత్స రాల పాటు కేంద్ర జల సంఘం లోనే విధులు నిర్వహించడం తో ఆయన దేశ వ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గడిరచారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల విషయాలపై సమగ్ర అవగా హన, సరైన ఆలోచనను కలిగి ఉండేవారు.

2016 నవంబ రులో  కాకతీయ విశ్వ విద్యాలయంచే నిర్వహించ బడిన ‘‘మిషన్‌ కాకతీయ’’ ప్రాజెక్టుకు సంబంధించిన సెమినార్‌ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో వ్యవసాయ రంగంలో నీటి పారుదల ప్రాజెక్టు లపై ప్రభుత్వ విధానాలను సమగ్రంగా వివరించారు. 2014లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (భారత దేశం) ఆయనను ‘‘లీడిరగ్‌ ఇంజ నీరింగ్‌ పెర్సనాలిటీస్‌ ఆఫ్‌ ఇండియా’’గా గుర్తించి, పురస్కార గ్రహీతను చేసింది. ఆయన ఎన్నో రచనలు చేశారు. పత్రికల్లో రాసిన వ్యాసాల న్నింటినీ కలిపి.. ‘నీళ్లు-నిజాలు’ పేరుతో పుస్తక రూపంలో ప్రచురించారు. అలా ‘‘నీళ్ళు నిజాలు విద్యాసాగర్‌ రావు’’గా పేరెన్నికగన్నారు. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో ఉచిత పాత్రలో నటించారు. ఐక్యరాజ్య సమితి ఇన్విరాన్‌ మెంటల్‌ ప్రోగ్రామ్‌లో సభ్యు డిగా, సెంట్రల్‌ వాటర్‌ కమి షన్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా సేవలు అందించిన విద్యాసాగర్‌ రావు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. 12వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన లోనూ సలహాలు అందించారు.
సాగునీటి రంగ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీరుగా, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగాసుపరిచితులు అయిన విద్యా సాగర్‌రావు రచయితగా, నటునిగా చూపిన ప్రతిభ గురించి చాలా మందికి తెలియదు. గిరీషం  కలం పేరుతో ఆయన రాసిన రచనలు అనేక పత్రికల్లో ప్రచురించారు. బాల్యంలో కవి సమ్మేళనాలు, నాటకాల ప్రదర్శనలకు వెళ్లేవారు. కాలేజ్‌ స్థాయి వివిధ పోటీల్లో పాల్గొని,  నాటకాలు కూడా వేసేవారు. కొంత కాలం ఆనారో గ్యానికి గురై, 2017 ఏప్రిల్‌ 29న   హైదరాబాద్‌లో  దివంగ తులైనారు.

-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *