సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు, నిరు పేదలకు చేరాలి

  • సామాజిక సాధనంగా ఉపయోగించుకోవాలి
  • నేటి ప్రపంచంలో ఇంజనీరింగ్‌ ‌వృత్తి చాలా క్లిష్టం
  • సైన్స్ ‌శాఖలను చేపట్టేందుకు మహిళలు మరింత ముందుకు రావాలి
  • విద్యార్థులు తమతో పాటు ఇతరులకూ సాధికారత కల్పించాలి
  • నారాయణమ్మ విద్యా సంస్థలను సందర్శించిన రాష్ట్రపతి ద్రైపది ముర్ము

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 29 : ‌సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు మరియు పేదలలోని నిరుపేదలకు చేరాలని, దీనిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ అండ్‌ ‌సైన్స్ ‌ఫర్‌ ఉమెన్‌ ‌విద్యార్థులు, అధ్యాపకులను, బిఎమ్‌ ‌మలానీ నర్సింగ్‌ ‌కళాశాల మరియు మహిళా దక్షతా సమితికి చెందిన సుమన్‌ ‌జూనియర్‌ ‌కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కంప్యూటర్లు, వైద్య పరికరాలు, ఇంటర్నెట్‌, ‌స్మార్ట్ ‌పరికరాలు డిజిటల్‌ ‌చెల్లింపు వ్యవస్థలతో సహా సాంకేతిక పురోగతిలో ఇంజనీరింగ్‌ ‌రంగం పెద్ద పాత్ర పోషించిందని రాష్ట్రపతి అన్నారు.

ఊహాతీతమైన మరియు గతంలో లేని సమస్యలకు సత్వర మరియు సుస్థిరమైన పరిష్కారాలు అవసరమయ్యే నేటి ప్రపంచంలో ఒక వృత్తిగా ఇంజనీరింగ్‌ ‌పాత్ర చాలా క్లిష్టమైనదని, ప్రపంచాన్ని మెరుగైన నివాస యోగ్య ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉందని రాష్ట్రపతి అన్నారు. వారు కనుగొనే పరిష్కారాలు, భవిష్యత్తులో వారు రూపొందించే సాంకేతికతలు ప్రజల జీవన నాణ్యత ఆధారితంగా మరియు పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలని సూచించారు. ఇటీవల కాప్‌ 27‌లో, భారతదేశం పుడమిని ఓ సురక్షిత గ్రహంగా ఉంచే తన భవిష్య దృష్టి కోణాన్ని పర్యావరణ హిత జీవన శైలి అనే ఒక పద మంత్రంలో పునరుద్ఘాటించిందని, మనం మన వాతావరణ లక్ష్యాలను సాధిస్తున్నామని, వాటిని ఉన్నతీకరణ చేస్తున్నామని, పునరుత్పాదక శక్తి, ఇ-మొబిలిటీ, ఇథనాల్‌-‌మిశ్రమ ఇంధనాలు మరియు హరిత హైడ్రోజన్‌లో కొత్త ప్రయత్నాలను చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా పర్యావరణ పరంగా మెరుగైన ఫలితాలను సాధించవొచ్చునని అన్నారు.

నేటి ప్రపంచంలో సాంకేతికత సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, పర్యావరణ మరియు భౌగోళిక రాజకీయ కోణాలను కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతుందని, ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇంజనీర్లు వినూత్న సాంకేతికతలతో ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు వొస్తారని, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ప్రత్యేక మద్దతు అవసరమయ్యే ఇతర వ్యక్తుల కోసం ఇంజనీరింగ్‌ ‌పరిష్కారాల గురించి కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. ఇంజినీరింగ్‌ ‌మరియు టెక్నాలజీలో మహిళల పాత్ర  గురించి రాష్ట్రపతి ప్రస్తావిస్తూ..పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న, స్టార్టప్‌లను ప్రారంభించి, టెలికాం, ఐటీ, ఏవియేషన్‌ ‌యంత్రాల రూపకల్పన, నిర్మాణ పనులు, కృత్రిమ మేధస్సు వంటి అన్ని రంగాలలో ప్రధానమైన నాయకత్వ స్థానాలను అధిరోహించి సహకరిస్తున్న ఎందరో స్ఫూర్తిదాయకమైన మహిళల ఉదాహరణలు మనకు ఉన్నాయని అన్నారు. సైన్స్ ‌శాఖలను చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. సైన్స్, ‌టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ ‌మరియు గణితం  భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవని ఆమె అన్నారు.

యువతులను సాంకేతిక నిపుణులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించవచ్చునని, సాంకేతిక రంగాలలో విభిన్న దృక్కోణాన్ని, నైపుణ్యాలను వారు కలిగి ఉంటారన్నారు. మహిళల గ్రహణ సామర్థ్యాలు వివిధ స్థాయిలలో జ్ఞానం మరియు సాంకేతికతలను గ్రహించే శక్తి  అధికంగా కలిగి ఉంటారని, తమకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి వారు కెరీర్‌లో ఎదగాలని ఆమె అన్నారు. విద్యార్థులు స్వయం సాధికారతతో పాటు ఇతరులకు కూడా సాధికారత కల్పించాలని రాష్ట్రపతి సూచించారు. కేవలం తమ విజయం, సంతోషాలతో సంతృప్తి చెందకూడదని ఆమె అన్నారు. దేశం పట్ల మరియు మొత్తం మానవాళి పట్ల వారికి కర్తవ్యం ఉంది. వారు తమ ప్రతిభను మరియు సాంకేతిక సామర్థ్యాలను విస్తృత ప్రయోజనం కోసం ఉపయోగించాలి. సాంకేతిక ప్రపంచంలోకి ప్రొఫెషనల్‌గా ప్రవేశించేందుకు అనేక మంది యువతులకు జీఎన్‌ఐటీఎస్‌ అవకాశాలను కల్పించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. మహిళా దక్షతా సమితి మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని కొనియాడారు. సమితి ఆధ్వర్యంలోని కళాశాలలు నిరుపేద మహిళలను అభివృద్ధి, సంరక్షణ, పోషణ మరియు సాధికారత కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *