- విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
- కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి
- సిద్ధిపేట పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో డిజిపి అంజనీకుమార్
- కమిషనరేట్ అద్భుతంగా ఉందని సిపి శ్వేతారెడ్డికి డిజిపి అభినందన
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : సమాజంలో వొస్తున్న మార్పులను గమనించి మనమూ మారాలని రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ అన్నారు. శనివారం సిద్ధిపేటలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా• సమావేశంలో డిజిపి మాట్లాడుతూ…విధి నిర్వణలో ఎట్టి పరిస్థితిల్లోనూ అలసత్వం వహించొద్దనీ, పారదర్శకంగా విధులు నిర్వహించి, కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్క అధికారి అందిపుచ్చుకోవాలని సూచించారు. గత 6, 7 నెలలలో 600 మంది పోలీస్ అధికారులకు ఇన్స్పెక్టర్ నుండి డిఎస్పి, డిఎస్పి నుండి అదనపు ఎస్పి, అదనపు ఎస్పి నుండి నాన్ క్యాడర్ ఎస్పి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అధికారులందరూ వారికి కేటాయించిన ప్రదేశాలలో విధి నిర్వహణలో నిమగ్నమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వొచ్చాయనీ, గత 10, 15 సంవత్సరాల క్రితం ఉన్న పోలీసింగ్ ఇప్పుడు లేదని కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 750 పోలీస్ స్టేషన్లు ఉన్నాయనీ, ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏ చిన్న తప్పు చేసినా మొత్తం డిపార్ట్మెంటు మీద పడుతుందని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని విధులు నిర్వహించాలని సూచించారు. ఆత్మగౌరవం, క్రమశిక్షణ, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధినిర్వహణలో మిస్ కమ్యూనికేషన్ ఉండవద్దన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సంబంధిత పోలీస్ అధికారులు ప్రతిరోజు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి అన్ని రకాల విధులు నిర్వహించాలని తెలిపారు. సంబంధిత ఎస్సైల బాధ్యత చాలా ముఖ్యమని తెలిపారు.
డిపార్ట్మెంటుకు కొత్తగా వొచ్చిన అధికారులకు రాబోవు సంవత్సరాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని టెక్నాలజీని బాగా నేర్చుకోవాలని సూచించారు. ఒకరితో ఇంకొకరు ఎప్పుడూ పోల్చుకోవద్దని విధి నిర్వహణలో మాత్రమే పోటీపడి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారికి నీతి నిజాయితీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సంస్కృతి సాంప్రదాయాలు చాలా ముఖ్యమని తెలిపారు. క్రైమ్ రేట్ తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం లాగా కలసి పనిచేయాలని తెలిపారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా ఛేదించి సరియైన సమయంలో చార్జ్‌షీట్ వేయాలని తెలిపారు. కేసులలో శిక్షణ శాతం పెంచాలన్నారు. ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ మనుగడకు చాలా ముఖ్యమని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ లీడర్షిప్ లక్షణాలు అలవర్చుకోవాలి. నిత్య విద్యార్థి లాగా ప్రతిరోజు కొత్తదనాన్ని నేర్చుకోవాలని, కొత్తదనం గురించి అన్వేషించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధునాతనమైన వాహనాలను అందించడం జరిగిందన్నారు. ప్రజల రక్షణకు సెన్సాఫ్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని తెలిపారు.
విధి నిర్వహణలో టైమ్ మేనేజ్మెంటు చాలా ముఖ్యమన్నారు. ఒక సబ్ డివిజన్ స్థాయి నుండి ఒక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా అదృష్టమని, పోలీస్ కమిషనరేట్ అద్భుతంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించడం జరిగిందనీ, పచ్చదనం, పరిశుభ్రత ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నదని పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డిని, అధికారులను, సిబ్బందిని డిజిపి అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. విశాలమైన హాళ్లు, విశాలమైన పార్కింగ్తో అహ్లాదకరంగా ఉందని అభినందించారు. ఈ సమావేశంలో అదనపు డిజిపి శిఖా గోయల్, డిఐజి రమేష్‌నాయుడు, సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డితో పాటు జిల్లాకు చెందిన డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్లు పాల్గొన్నారు.




