పరిగి , ప్రజాతంత్ర, జూలై 23 : పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అనుకున్నంత మేర ఫలితాలు కనబడడం లేదు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను కొనసాగిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వ బడులు సమస్యలతోనే సతమతం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎన్నో సమస్యల మధ్య తమ చదువులు కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పరిగి మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించగా అక్కడ అనేక సమస్యలు దర్శనం ఇస్తున్నాయి.
పుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులు…
పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా పుస్తకాలు అందలేదు. చాలా వరకు ముఖ్యమైన సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు నీరు కారుతున్న తరగతి గదులు, పెచ్చులూడుతున్న భవనాలు
పాఠశాలలో కొన్ని తరగతి గదులలో వర్షానికి నీరు కారుతూ ఉండడంతో విద్యార్థులు వరండాలో చదువులు కొనసాగిస్తున్నారు.
తరగతి గది పక్కనే వంటగది…
తరగతి గది పక్కనే వంటగది ఉండడంతో విద్యార్థులు పొగ కారణంగా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. వంట చేస్తున్న సమయంలో పొగ వొస్తుండడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
పాఠశాలలో స్వీపర్లు లేరు…పరిశుభ్రత అంతంత మాత్రమే
500 మంది వరకు ఉన్నటువంటి పాఠశాలలో స్వీపర్లు లేకపోవడంతో కొన్ని తరగతి గదుల పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనం ఇస్తున్నాయి. దానికి తోడు పాఠశాల ఆవరణలో కూడా చెత్తా చెదారం కనబడుతున్నాయి. నేటి వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం.
అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు..
విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో భాగంగా వాడుతున్న కూరగాయలు అపరిశుభ్ర వాతావరణంలో ఉంచుతున్నారు. తద్వారా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాల కారణంగా పరిస్థితి ఇలా ఉందని నిర్వాహకులు తెలిపారు. అధికారులు స్పందించి ప్రభుత్వ బడులలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




