మది హూంకరించిందేమో?
మనసాక్షి కళ్ళు తెరిచిందిమో?
పాపాల పుట్టలు పగిలి
శాపాల తాపాలు రగిలాయో?
పరితాపాల గుట్టలు కదిలి
చింతల సెగలు కదిలాయో?
భూమి కృంగుతున్న భావమో?
భారపు పగ్గం తెగుతున్న భావనో?

పాషాణపు మదిలో
భూకంపాలు వచ్చాయో?
జల ప్రళయాలు కలిగాయో?
రాకాశపు మతిలో
మనసు తడి తెలిసిందో?
మమత జడి కురిసిందో?
ఇంకిపోయిన ప్రేమలపై
వానజల్లు కురిసిందో?
జంకిపోయిన నవ్వులపై
వసంతం ఒలికిందో?

వీడిన చెలిమి తలపు వచ్చిందో?
ఓడిన వలపు జ్ఞాపకం కలిగిందో?
కాలం తెచ్చిన దుఃఖం కలుక్కుమందో?
కష్టం వెనుక విజయం తళుక్కుమందో?
నమ్మక ద్రోహం తెలిసి వచ్చిందో?
చేసిన పాపం తరుము కొచ్చిందో?

కన్నీటి బానలు పగిలి
వరదలై పొంగుతుంటే!
ఊపిరి గాలులు చెదరి
నిట్టూర్పుల  కక్కుతుంటే!
కాలాన్ని వేడుకుంటున్నది!
పశ్చాత్తాపానికి ఫలితం లేదాయని?
ప్రాయశ్చిత్తానికి సమయం ఉందాయని?
   – ఉషారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *