తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్ కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం ఉదాహరణగా నిలుస్తుంది. విశ్వమిత్ర తేజ వినువరేణ్య మకుటంతో 118 పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలోని ఎగుడు దిగుళ్లు, అసమానతలు, దమన నీతిని, అసహజతను ఈ పద్యాలలో వేణుశ్రీ నిశితంగా నిరసించారు.
లోకమందు నీతి లోకువైపోయిందని, ధనమే ధరణిని పరిపాలిస్తుంటే మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదని వేణుశ్రీ వాపోయారు. మంచి పనులతో మానత్వాన్ని పెంచాలని అన్నారు. మనుషులలో నీతి మాయమైపోయి చెడుకు వారు దగ్గరవుతున్నారని అంటూ చరిత్రను పరిశీలించి చూస్తే ఇదే కనబడే సత్యమని చెప్పారు. స్వార్థాన్ని విడిచిపెట్టి త్యాగధనులను తలచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. రాజకీయాలలో కొంచమైనా కానరాని నీతిని గురించి తెలిపారు. పదవులు పొంది ముల్లె సంపాదించాలనుకునే నాయకులు పెరిగిపోయారని అన్నారు. ప్రజల సొమ్ము తమదిగా చేసుకునే వారే సమాజంలో ఎక్కువయ్యారని అన్నారు. ప్రజలకు న్యాయం చేయని నాయకులు ఉన్నా లేనట్టే లెక్క అని అన్నారు. కష్టంలోనూ ప్రజలను కనికరించని నాయకుడు ఉండి ఎందుకని ప్రశ్నించారు.
చెప్పెదొకటి పెబ్బె చేసేది మరొకటి
నిత్తెమనెడి మాట నిజముసుమ్మి
పెబ్బె పెంపులోన పేదల శ్రమయేను
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
మాటపై నిలబడని ఉత్తమాటల నేతలకు పేదల శ్రమను దోచుకోవడమే పనిగా మారిందని అన్నారు. పొట్టకూటి కోసం పోరాడే ప్రజల పట్ల ప్రభుత్వంలోని పాలకుల తీరు పక్షపాతం లేకుండా ఉండాలని చెప్పారు.
రాజకీయ మిచట రాచపుండుగ మారె
న్యాయభీతి లేని నాయకులిల
ధర్మమార్గమంటె దాడిచేయగలరు
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
లోకంలో కనికరం ఎరుగకుండా కల్తీ పెరిగిపోయిందని, సర్వత్రా లంఛమే రాజ్యమేలుతుందని వేదనపడ్డారు. నీతి కలిగిన వారు నిలిచే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. లొసుగులు లేకుండా శాసనాలు చేయవలసిన అవసరాన్ని తెలియజెప్పారు. న్యాయ శాస్త్రం, న్యాయవాదులు సమాజాన్ని కాపాడాలని అన్నారు. సెల్‌తో ఉన్న ఉపయోగాలు, అనర్థాలను వివరించారు. టీవీలలో వచ్చే సీరియళ్లతో వచ్చే ప్రమాదాన్ని, కాసింత మాత్రమే ఒనగూరే ప్రమోదాన్ని కూడా తెలిపారు. ఆటపాటలతో, ఆరోగ్యంతో చదువు సక్రమంగా సాగి విద్యార్థులను మమతామూర్తులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. విద్య విలువ లేనిదిగా మారి క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోతున్నదని అన్నారు.
పాఠశాలలుండు పంతుళ్ళు లేకుండ
పంతులున్న బడిన బాల లేరి
విలువ లేదు నేటి విద్యలయందున
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
ప్రభుత్వ బడులలో సౌకర్యాల లేమిని ప్రస్తావిస్తూ సాగిన పద్యాలు ఎన్నో లోతైన ఆలోచనలకు తెరతీస్తాయి. ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ అలక్ష్య ధోరణి వంటి ఎన్నో అంశాలను కవి లేవనెత్తడం పలు పద్యాలలో స్పష్టంగా గమనించవచ్చు. పెద్దల మాట విని భవిష్యత్తును దిద్దుకోవాలన్న సూచనను కూడా కవి అందించారు.
అమ్మ నాన్న మాట ఆరోగ్యమునుపెంచు
బామ్మ మాట బతుకు బాటజూపు
తాత నోటపాట, తలరాతలను మార్చు
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
కక్ష లేకుంటే కరుణ పెరుగుతుందని జాతీయతను పెంచుతూ జగతి ముందుకు సాగాలని అభిలషించారు. అవినీతి, వరకట్న దాహం వంటి అనేక సమస్యలను విశ్లేషిస్తూ కవి తనదైన ప్రత్యేక కోణంలో స్పందించారు. పాపభీతి లేక పాడుపనులు చేయడం సరికాదని భయం విడిచి లోకంలో ధైర్యంగా బతకాలని చెప్పారు.
తెలివి లేకయున్న తేలిక భావంబు
చదువు చదివి యున్న జ్ఞానమొప్పు
మోసగాని పలుకు మోహమ్ముపెంచును
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
మనుషుల్లో కొంతైనా మమతానుబంధాలు కనిపించడం లేదని వాపోయారు. వాదులాటలు మాని కలిసి జీవించడం మంచిదని హితవు చెప్పారు. కులమతాల కన్నా గుణమే మిన్న అన్నారు. చెట్లను నరకడం ద్వారా ప్రకృతి సంపదను దెబ్బతీయాలనుకోవడం ఘోర విపత్తుకు దారి తీస్తుందని తెలిపారు. పద్య, గద్యమన్న పరిహాసములు ఎందుకని ప్రశ్నించారు. సమతుల్య సాహిత్యం సమాజానికి ఆరోగ్యకరమని భావించారు.
పద్యమైన నేమి పామరుడునుమెచ్చ
గద్యమైన నేమి గతిని మార్చ
పద్యగద్యమందు పరిణతి గావలె
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
రైతులకు అకాలం వల్ల కలిగే దయనీయ దుస్థితి వల్ల ఆత్మహత్యలు తప్పలేదని వేదన చెందారు. వరి, పత్తి వల్ల నష్టపోయిన రైతుల కష్టాలను తెలిపారు. వానలు కురిసి బతుకులు ఆకుపచ్చగా వికసించాలని కోరుకున్నారు.
వాన చినుకు పడగ వసుధ పులకరించె
కర్రు సాళ్ళ వలన కడుపు పండె
పచ్చపచ్చ చేళ్ళు ప్రసవించె నేలపై
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
సమాజంలోని వివిధ రకాల మనుషుల నైజాలు, ఈర్శ్యా, ద్వేషాలు, కోపప్రకోపాలు, కోల్పోతున్న అనుబంధాలను, ధనం పాత్ర పెరిగి జరుగుతున్న అనర్థాలను పలు పద్యాలలో వివరించారు. పాత, కొత్త తరాల మధ్య వారధిగా మమత పెరిగి వికసించి వెల్లివిరియాలని కోరుకున్నారు. మంచిని పెంచే మనుషులు కావాలని కోరుకున్నారు.
మంచిని గెలిపించు మనుషులు కావలె
మేలు చేయ నెంచు మేలు కొరకు
వంచనలను చేయు వారల తరుముడు
విశ్వమిత్ర తేజ వినువరేణ్య!
ప్రజలందరికీ మంచి జరగాలంటే, ఆత్మగౌరవం పరిమళించాలంటే సమాజంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవాలని అన్నారు. ఆర్థిక, రాజకీయ సమానత నెలకొనాలన్న బలమైన భావనను ఈ పద్యాలలో వేణుశ్రీ వెల్లడించారు. సామాజిక చైతన్యానికి ఉపయోగపడే పద్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. వ్యవహారిక భాషా ప్రయోగాన్ని చేసి పాఠకులకు ఎంతో చేరువయ్యే పద్య ప్రయత్నాన్ని కవి వేణుశ్రీ చేశారు. ప్రజల జీవితాల్లో ప్రగతికారకమైన మౌళిక మార్పును ఆయన స్పష్టంగా ఆకాంక్షించారు.
– తిరునగరి శ్రీనివాస్, 8466053933




