కానీ మణిపూర్‌లో ఇద్దరు స్త్రీలను మానవత్వం సిగ్గుపడేలా, ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా, నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన పట్ల ఈ నాయకులంతా, దేశ ప్రధాని తో సహా కొన్నినెలల పాటు మౌనం వహించారు. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఒక వ్యక్తి అనగానే వీరంతా ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే మణిపూర్ లో ఇంత క్రూరమైన సంఘటన జరిగినప్పుడు మాత్రం వీరి నోళ్లు ఎందుకు మూగబోయాయి? మనుషుల ప్రాణాల కన్నా, స్త్రీలపై జరిగిన అత్యాచారాల కన్నా వీరికి సనాతన ధర్మమే ఎందుకు ముఖ్యమైనదయ్యింది.ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మానికి రాజ్యాంగ విలువలైన సమానత్వము, సౌభ్రాతృత్వాలకు ఉన్న తేడా ఏమిటి? ఈ రెంటికి వైరుధ్యం ఉన్నదా? ఇంతకీ ఈ సనాతన వాదులు సనాతన ధర్మానికి సంబంధించి చెబుతున్నది ఏమిటో, కొంత పరిశీలించవలసిన అవసరం ఉన్నది.
ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి?
సనాతనం అంటే శాశ్వతమైన, మార్పులేని, నిత్యమైన అన్న అర్థాలు సంస్కృత భాషతో పరిచయం ఉన్న ఎవరైనా తెలుసుకోగలరు. సనాతన ధర్మం అంటే నిత్యమైన, ఎప్పుడు మారని, శాశ్వతమైన జీవిత విధానము అని అర్థం చెప్పుకోవచ్చు.
అయితే శాశ్వతమైనది…ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది సనాతన ధర్మమే అని హిందూత్వవాదులు లేదా సనాతనవాదులు అంటూ ఉన్నప్పటికీ వారు నమ్మిన ఈ సనాతన ధర్మమే నిరంతరం మార్పు చెందుతూ వస్తూ ఉన్నది అన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. నిజానికి శాశ్వతమైనది ఏదైనా ఉన్నది అంటే, అది కేవలం ‘‘మార్పు’’ మాత్రమే. మారనిది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇకపోతే సనాతన ధర్మానికి ఆలంబన అయినటువంటి తాత్వికత ఎక్కడి నుంచి వస్తున్నది. ఈ సనాతన ధర్మానికి ఆధారభూతాలైన గ్రంథాలు ఏమిటి? ఏ గ్రంథాల ఆధారంగా మనం సనాతన ధర్మాన్ని నిర్వచించుకోవచ్చు? అన్న ప్రశ్నలకు ‘వేదాలే ప్రమాణం’ అన్న సమాధానానికి మనం సులువుగానే చేరుకోవచ్చు.
ప్రాపంచిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం , ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ఎంచుకోవడం కోసం, సాధారణ మానవులు ప్రయత్నం చేసినప్పుడు వారికి మార్గదర్శనం చేయగలిగే గ్రంథాలు వేదాలే నని ఈ హిందూత్వ లేదా సనాతనవాదులు ఘంటాపథంగా చెబుతారు. సనాతన ధర్మానికి వేద ప్రామాణికతే మూలం. ఇంతకీ మరి వేదం ఈ సమాజాన్ని మనుషులు జీవించడానికి కావలసిన ఒక మార్గాన్ని, వారు చెబుతున్నట్టుగా ధర్మాన్ని ఏరకంగా రూపొందించింది. ఏ మత గ్రంథం చెప్పని విధంగా వేదాలు, పుట్టుకతోనే మనుషులు అసమానులని, నాలుగు వర్ణాలుగా పుట్టారని, ఈ అసమానమైన, బేధభావంతో కూడినసృష్టిని సాక్షాత్తు పరబ్రహ్మే చేశాడని, మనుషులు ఎన్నటికీ సమానులు కాలేరని చెబుతాయి.
క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో పురుడుపోసుకున్న బౌద్ధం ఈ వర్ణవ్యవస్థను నిరసిస్తూ మానవుల మధ్య సమానత్వాన్ని సహోదరత్వాన్ని ప్రతిపాదించింది. దాని ప్రభావం సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగిన తరువాత తిరిగి ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు, వైదిక ధర్మానికి లేదా సనాతన ధర్మానికి పూర్వ వైభవం కల్పించింది ఆదిశంకరాచార్యులు.బౌద్ధం ప్రభావం వల్ల బలహీనపడ్డ వర్ణ వ్యవస్థను తిరిగి పునర్జీవింప చేసి మనుషుల మధ్య అంతరాలను తిరిగి బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. చరిత్రలో దీనికి రుజువు కూడా ఉన్నది. చంద్రగుప్తుని కాలంలో బౌద్ధం యొక్క తాత్విక దృక్పథాన్ని, బుద్ధుని బోధనలను అధ్యయనం చేయటానికి చైనా నుంచి వచ్చిన ఫాహియాన్ బౌద్ధం ఎంత విస్తృతంగా జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిందో, ప్రజలపై బుద్ధుని సమానత్వ సిద్ధాంత ప్రభావం ఏరకంగా వేళ్ళు ఊనుకొని పోయిందో ఆయన, తన రచనల్లో వివరించారు. ఆ తరువాత క్రీస్తు శకం ఏడవ శతాబ్దం అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన హూయన్ సాంగ్ అనే మరో చైనా యాత్రికుని రచనలు బౌద్ధం ఎలా క్షీణించిందో, బ్రాహ్మణవాదం, వైదిక ధర్మం తిరిగి ఎలా పుంజు కున్నదో, ప్రజలు తిరిగి కుల అంతరాల్లోకి ఎలా నెట్టి వేయబడ్డారో కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు. అయితే ఈ 1000 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి?
వెయ్యి సంవత్సరాలపాటు ప్రజలందరి మధ్య సమానత్వాన్ని సాధించిన, పేద, ధనిక అగ్రవర్ణ, నిమ్నవర్ణ బేధాలు లేకుండా ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన మతం ఒక 1,000 సంవత్సరాల్లో ఎంత సాహిత్యాన్ని సృష్టించగలదో మనం ఊహించవచ్చు. ప్రపంచం అబ్బురపడే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలను బౌద్ధమే సృష్టించింది. అక్కడ ఉన్న గ్రంథాలయాలే సుమారు పది అంతస్తుల మేడల్లో కొనసాగేవని మనకు చైనా నుంచి వచ్చిన యాత్రికులైన పాహియాన్, హుయాన్ సాంగ్ రచనల ద్వారా తెలుస్తోంది. అయితే బౌద్ధం సాధించిన ఈ ప్రగతిని చదువుకోటానికి కానీ, తెలుసుకోవటానికి కానీ ఒక్క గ్రంధము మిగలలేదంటే దీని వెనక ఏ ధర్మం యొక్క కుట్ర ఉన్నదో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
బౌద్ధం ఈ దేశంలో విలసిల్లినంత కాలం అందరికీ చదువుకునే అవకాశం అందరికీ సమానమైన హక్కులు లభించిన ఈ దేశంలో తిరిగి ఆదిశంకరాచార్యుల ప్రభావం తర్వాత మాధవాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారి వల్ల వర్ణ వ్యవస్థ తిరిగి బలంగా పాదుకొనిపోయి, ఈ దేశపు మెజారిటీ ప్రజానీకం తీవ్రమైన పీడనకు బానిసత్వానికి గురయ్యారు. ఈ వర్ణ వ్యవస్థ మెజారిటీ ప్రజలను బానిసలుగా మార్చటానికి ఉపయోగపడిరదే తప్ప సమానత్వాన్ని సాధించడానికి గాని సమానమైన అవకాశాలను కల్పించడానికి కానీ ఉపయోగపడలేదు. అయినా నేడు ఈ హిందుత్వవాదులు సనాతన ధర్మమే ఉన్నతమైనదని, అది శాశ్వతమైనదని మానవాళి జీవించడానికి అత్యున్నతమైన జీవిత విధానాన్ని సమకూర్చేది సనాతన ధర్మమే అని నిస్సిగ్గుగా నమ్మబలుకుతున్నారు.
ఒకవేళ ఈ సనాతన ధర్మమే ఉన్నతమైనది అయితే మరి మన దేశంలో నాలుగు వేలకు పైగా కులాలు ఎవరు సృష్టించారు. హెచ్చుతగ్గులను సృష్టించింది ఎవరు? వర్ణాలు పక్కన పెట్టండి ఒక వర్ణంలోని వివిధ కులాల మధ్య కూడా వైవాహిక సంబంధాలను నిషేధించింది, కనీసం ఒక్క బంతిలో కూర్చొని భోజనం చేసే అవకాశాలను సైతం లేకుండా చేసి మనుషులను ఇంతగా చీల్చింది ఏ ధర్మం?స్త్రీల అభిమానాన్ని కూడా దాచుకోకుండా, వారికి కనీసం తమ మానరక్షణ చేసుకునే అవకాశాలను సైతం నిషేధించి రొమ్ము పన్నులు కూడా వేసింది ఏ ధర్మం? 4 సెప్టెంబర్ 1987లో సతీసహగమనం పేరుమీద కేవలం 18 సంవత్సరాల రూప్ కన్వర్ అనే క్షత్రియ స్త్రీని బలవంతంగా సజీవ దహనం చేసింది ఈ సనాతన ధర్మం కాదా? ఈ హిందూత్వ, ఈ సనాతన ధర్మ వాదులే కదా దానిని సమర్ధించి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటానికి కారణమయింది నిజం కాదా?
అంతేకాదు ఆలయ సందర్శన కోసం వెళ్లిన దళితులను ఆలయాల్లోకి రావద్దని అవమానించి వారిపై భౌతిక హింసకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం మనం వింటూనే ఉన్నా వీటిని ఖండిరచటానికి నోరు రాని ఈ సనాతన వాదులు, హిందుత్వ వాదులు, సనాతన ధర్మాన్ని నిషేధించాలని నిర్మూలించాలని అనగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కానీ అదే సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహించే ఆలయాల్లోకి అస్పృశ్యుల ప్రవేశాన్ని నిషేధించిన సందర్భాలలో మాత్రం వీరికి నోరు పెగలదు. వారి సిద్ధాంతం ప్రకారం చూసిన అస్పృశ్యులు హిందువులే కదా. బహుశా సనాతన ధర్మం అమలైతే జరగబోయేది ఇదేనేమో! అందుకే వారు మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన సంఘటన విషయంలోనూ, ఆలయాల్లోకి దళితుల ప్రవేశం నిషేధించిన సందర్భాల్లోనూ మౌనంగా ఉంటారు.
దేశాన్ని గత పదేళ్ల నుంచి పరిపాలిస్తున్న ఈ హిందుత్వ వాదులు, సనాతన వాదులు తమ విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగి ఉన్న వారిని,భిన్నమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉన్న వారిని వరుసపెట్టి చంపుతున్నారు. ఆవు మాంసం కలిగి ఉన్నారన్న నెపంతో సుమారు 100 మందిని ఇప్పటికే చంపివేశారు. అంటే సనాతన ధర్మానికి మనిషి ప్రాణం కంటే విశ్వాసాలే గొప్పవన్నమాట. ఆ విశ్వాసాల్లో వర్ణధర్మం కూడా ఉంటుందన్నమాట. ఒక కులం లో పుట్టిన మనుషులు మరొక కులంలో పుట్టిన మనుషులకు, సనాతన ధర్మ కొలమానం ప్రకారం ఎన్నటికీ సమానం కాలేరన్నమాట. ఈ మనుషుల మధ్య గల అంతరాలు ఇలాగే శాశ్వతంగా కొనసాగాలన్నదే ఈ సనాతనధర్మ వాదుల కోరికన్నమాట.
అగ్రవర్ణాలలోని పేదలకు
సనాతన ధర్మం నిజంగా మేలు చేస్తుందా?
గత పదేళ్ల పాలన అగ్రవర్ణాల్లోని పేదలకు ఎంత మేలు చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ, సంస్థలన్నింటినీ విచ్చలవిడిగా తెగ నమ్మి, చేతి వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే కొద్ది మందికి ఆ ఆస్తులు అన్నింటిని దోచిపెట్టి, ఈ దేశపు యువతరానికి ఉపాధి అవకాశాలను, భద్రతతో కూడిన భవిష్యత్తును లేకుండా చేసి ఈ సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం ఘనత వహించింది.రిజర్వేషన్లు అమలయ్యే ప్రభుత్వ సంస్థ లన్నింటినీ యదేచ్చగా అమ్మి వేయటమో, ప్రైవేటీకరించటమో చేసి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మోసం చేసిన ఘనత ఈ సనాతన ధర్మ వాదులదే. శూద్రులలోని అగ్ర కులస్తులను, అగ్రవర్ణాల వారు శూద్రులని అవమానిస్తూనే, ఆ విషయమే అర్థం కానివ్వకుండా అదే శూద్ర అగ్రకులాలను రిజర్వేషన్ల బూచి చూపి తమ శూద్రవర్ణంలోని ప్రజలకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్న ధర్మమే సనాతన ధర్మం.
సనాతన ధర్మ వాదుల పరిపాలన ఎలా ఉండగలదో కర్ణాటకలోనూ, మణిపూర్ లోనూ, హర్యానాలోను జరిగిన మత ఘర్షణలే అద్దం పడుతున్నాయి. తమ మత విశ్వాసాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వెలిబుచ్చిన వారిని చంపి వేస్తామంటూ ఫత్వాలు జారీ చేసే తాలిబన్లకు, ఉదయనిధి స్టాలిన్ను చంపివేస్తామని, చంపివేసిన వారికి కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని, ప్రకటిస్తున్న సనాతన వాదులకు మధ్య తేడా లేదని కూడా మనం గమనించాలి.పదేళ్ల సనాతనవాదుల పరిపాలన తరువాతైన ఈ దేశపు మెజారిటీ ప్రజలైన బహుజనులు తమకు సనాతన ధర్మం కావాలో లేక రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ విలువలు కావాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలకు, సనాతన ధర్మాన్ని, హిందుత్వవాదులను తిరస్కరించాల్సిన సమయం, లౌకిక, ప్రజాస్వామిక, సమానత్వ విలువలను ఎత్తి పట్టవలసిన సమయం మునుపటి కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంది. సనాతన వాదులపట్ల, హిందుత్వవాదుల పట్ల అలసత్వం వహిస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం సాధించుకున్న ప్రజాస్వామిక, లౌకిక విలువలు ఎలా తుడిచిపెట్టుకుపోగలవో ఒక్కొక్కటిగా కూలిపోతున్న రాజ్యాంగ వ్యవస్థలే నిదర్శనం. రాజ్యాంగం ఏర్పరిచిన అనేక స్వతంత్ర సంస్థలు నిర్వీర్యం చెంది హిందుత్వవాదుల, సనాతన వాదుల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయి, భిన్నమైన అభిప్రాయాలను, భిన్నమైన రాజకీయ విశ్వాసాలను ఎలా అణచి వేయగలవో మనం చూస్తున్నాం. మేల్కొనకపోతే మనకు రానున్నవి చీకటి రోజులే.
– టి.హరికృష్ణ
మానవ హక్కుల వేదిక
9494037288




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల