సంతోషమే పూర్తి బలం

సంతోషం సగం బలం ఆనాడు, సంతోషమే పూర్తి బలం ఈనాడు. సంతోష సాగరంలో ఈద డానికి నవ్య నరుడు విశ్వ ప్రయత్నం చేస్తూ, ఆనంద తీరాలు చేరడానికి డిజిటల్‌ ‌యుగపు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. ఆనందమనే మానసిక భావన కలగడానికి అనేక మార్గాలు వెతుకుతున్న మానవుడు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు షికారీ అవుతున్నాడు. డబ్బుతో ఆనందాన్ని ఖరీదు చేయాలనుకోవడం, దురాశ, అల్ప ప్రయత్నం, అర్హతకు మించి కోరుకోవడం, ఆనందాన్ని అంగడి సరుకనుకొని కొనుక్కోవాలనుకోవడం లాంటివి ఆధునిక మనిషిని సంతోష సంపద నుంచి దూరం చేస్తున్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. ప్రపంచ మానవాళి సంతోషాలను ఆరోగ్య భద్రత, ఆదాయం, వాతావరణ మార్పులు, రాజకీయం, పేదరికం, నిరుద్యోగం, అధిక జనాభా, జీవన ప్రమాణాలు, జిడీపి, సామాజిక స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి స్థాయి, సామాజిక భద్రత, ఆయుర్దాయం, సేవాభావం, ఆరోగ్యకర జీవన అంచనాలు లాంటివి ప్రభావితం చేస్తాయి.
ప్రపంచ సంతోష సూచిక:
ప్రపంచ దేశాల ప్రజల సంతోషాలను శాస్త్ర పద్దతిలో ‘‘వరల్డ్ ‌హాపీనెస్‌ ఇం‌డెక్స్ (‌ప్రపంచ సంతోష సూచిక)’’ ఆధారంగా నిర్ణయించి 150 దేశాల జాబితాను 2012 నుంచి విడుదల చేయడం జరుగుతున్నది. ‘‘యూయన్‌ ‌సస్టేనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సొల్యూషన్స్ ‌నెట్‌వర్క్’’ ‌తాజాగా విడుదల చేసిన ‘‘వరల్డ్ ‌హాపీనెస్‌ ఇం‌డెక్స్-2023’’ ‌నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నది. ఈసారి ప్రపంచంలోని 146 దేశాల ప్రజల సంతోష సూచిక స్థాయిలను 10 పాయింట్ల స్కేల్‌తో నిర్ణయించారు.
టాప్‌ 10 ‌హాపీనెస్‌ ఇం‌డెక్స్ ‌కంట్రీస్‌:
‌తాజాగా విడుదల చేసిన ‘‘వరల్డ్ ‌హాపీనెస్‌ ఇం‌డెక్స్-2023’’ ‌నివేదిక ప్రకారం అత్యధిక సంతోష సూచిక కలిగిన తొలి 10 దేశాల్లో ఫిన్‌లాండ్‌ (7.84/10), ‌డెన్మార్క్ (7.62), ‌స్విస్జర్‌లాండ్‌ (7.57), ఐస్‌లాండ్‌ (7.55), ‌నెథర్‌లాండ్స్ (7.46), ‌నార్వే (7.39), స్వీడెన్‌ (7.39), ‌లాగ్జెన్‌బర్గ్ (7.32), ‌న్యూజిలాండ్‌ (7.28), ఆ‌స్ట్రియా (6.27)లు ఉన్నాయి. ఇతర ముఖ్య ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఆస్ట్రేలియా, 17వ స్థానంలో యూకె, 19వ స్థానంలో యూయస్‌, 55‌వ స్థానంలో జపాన్‌, 82‌వ స్థానంలో చైనా ఉన్నాయి.
హాపీనెస్‌ ఇం‌డెక్స్‌లో భారతం:
146 దేశాల హాపీనెస్‌ ఇం‌డెక్స్-2023 ‌జాబితాలో ఇండియా 3.82/10 సూచికతో 136వ స్థానంలో నిలిచింది. 2020 వరల్డ్ ‌హాపీనెస్‌ ఇం‌డెక్స్ ‌జాబితాలో ఇండియా 144వ స్థానం, 2021లో 139వ స్థానం పొందడం జరిగింది. భారత్‌కు పొరుగు దేశాలైన నేపాల్‌ 84‌వ స్థానం, బంగ్లాదేశ్‌ 94, ‌పాకిస్థాన్‌ 121, ‌శ్రీలంక 127, చిట్ట చివరి 146వ స్థానంలో అఫ్ఘానిస్థాన్‌లు ఆక్రమించాయి. ఇండియాలో నెలకొన్న అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, అధిక జనాభా, నిరక్షరాస్యత లాంటి అనేక కారణాలు ప్రజల ఆనందాలను ఆవిరి చేస్తున్నాయి. సంపన్నులు చేసే ఆర్భాటపు వివాహాలు, శుభకార్యాలు కూడా సగటు మనిషి అసంతృప్తికి కారణం అవుతున్నాయి.
సంతోషమే పూర్తి బలం:
సగటు భారతీయుడికి సంతోషం అందని ద్రాక్షలా మారుతున్నది. వేగవంతమైన ఆధునిక యుగంలో మనిషి తెలియని దాని వెంట పరుగులు తీస్తున్నాడు. మన జీవన స్థితిగతులు, అలవాట్లు, ఉద్యోగ ఉపాధి సమస్యలు, కుటుంబ భారాలు లాంటి పలు అంశాలు మన ఆనంద క్షణాలను హరిస్తున్నాయి. సానుకూల భావనలే సంతోషాలకు ముఖ్య సాధనాలు. అనవసర ఒత్తిళ్లు, అందని దాని కోసం ఆరాటాలు, ఉన్న దానితో తృప్తిపడక పోవడం, దాతృత్వం కొరవడడం, ఉదారతను ప్రదర్శించక పోవడం, దురలవాట్లు, అనారోగ్యాలు, చిన్న సమస్యను పెద్దదిగా ఊహించడం, అంచనాలను చేరుకోలేమనే అసంతృప్తి, ఇంకేదో కావాలనుకుంటూ నిరాశ/నిస్పృహలు, ధనంలో ఆనందాలను వెతుక్కోవడం లాంటి అవాంతరాలు సంతోష తీరాలకు చేరకుండా అడ్డుపడుతున్నాయి. ఆనందంగా ఉన్నామనే భావనలే మనల్ని సంతోష దరికి చేరుస్తాయని మరిచి పోతున్నాం.
ఆనందం ఓ అంతరంగ భావన:
సంతోషంగా ఉండడమనే భావన అంతరంగానికి చెందినదని మరిచి పోతున్నాం. పేద వాడికి ఉన్న సంతోషం ధనికులకు ఉండడం లేదు. ధనికులు ఆనందానికి దూరంగా జీవనశైలి వ్యాధులకు దగ్గరగా జరుగుతున్నారు. పరిమిత ఆశలు, అర్హతకు తగిన ప్రయత్నాలు, సదాశయాలు, పరహిత భావనలు, కోరికలకు కళ్లెం వేయడం, ఉన్న దానితో సంతోషపడడం, నైతిక విలువలకు పట్టం కట్టడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం, సానుకూల దృక్ఫథం కలిగి ఉండడం, ధైర్యంగా సమస్యలను అధిగమించడం లాంటి పలు మార్గాలు మనల్ని సంతోషలోకంలో విహరింపజేసి, ఆనందామృతాల రుచిని చూపుతాయి.ఆనందంతోనే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహా భాగ్యమని, సంతోషమే పూర్తి బలమని తెలుసుకుందాం. ఆనందం కొరవడిన జీవితం సువాసనలేని మల్లెపువ్వని నమ్ముదాం. మన అంతరంగంలో దాగి ఉన్న ఆనంద నిధులను అవిష్కరిద్దాం.
image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగరం – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *