- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
- యోగాతో ఒత్తిడి తగ్గుతుందా..
మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ, కొందరు ఇంకా ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. మొదట్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ సులభంగా అనిపించేది. ఇప్పుడు ఒత్తిడితో కూడి మానసిక ఆందోళనలకు దారి తీస్తోంది. మరి కొందరిలో కరోన తో వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడి ప్రస్తుతం ఆఫీస్ కు వెళ్ళి పని చేయాలన్న ఒత్తిడికి లోనవుతున్నారు. యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే ‘‘యోగా దినోత్సవం’’ ముఖ్య ఉద్దేశం.
పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానమే యోగా. యోగా సాధనతో మనిషి చురుగ్గా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతతను పొందుతారు. అందుకే ఉరుకుల పరుగల జీవితంలో పది నిమిషాలైన యోగాకు సమయం కేటాయిస్తే వందేళ్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది. యోగా మనిషి విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకత స్థాయిల్ని పెంచుతుంది. యోగా సాధన ఒత్తిడిని దూరం చేయడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. ఇక యోగా సాధన వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మానసిక, నరాల సంబంధింత సమస్యలు రాకుండా నివారిస్తుంది. నిత్యం యోగా సాధన చేసే వ్యక్తులైనా, కొత్తగా నేర్చుకుంటున్నావారైనా సరే రోజూ కొన్ని నిమిషాల పాటు యోగా ప్రాక్టీస్ చేస్తే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోటు వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. శరీరాన్ని మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి యోగాభ్యాసానికి మాత్రమే ఉంది.మానసిక ప్రశాంతత: మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలకు యోగా మంచి మందులా పనిచేస్తుంది. యోగా సాధనతో ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. డిప్రెషన్ లాంటి సమస్యలు దరి చేరవు. యోగాను ఎంత ఎక్కువగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత అంతగా పెరుగుతుంది. యోగా సాధన తర్వాత మనిషి మనసు ప్రశాంతంగా మారడంతో పాటు సానుకూల దృక్పథం పెరుగుతుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రమబద్ధమైన జీవనశైలికి యోగా టానిక్ లా పనిచేస్తుంది.
మేధోశక్తి మెరుగు: యోగా సాధన ద్వారా అవయవాలు, నాడీకేంద్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది. నరాల్లో కొత్త ఉత్తేజం నిండి మెదడు, శరీరం, మనసుకు కొత్త శక్తి వస్తుంది. యోగా మనిషి జ్ఞాపకశక్తిని, అభ్యసన సామర్థ్యాన్ని, మేథోశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీర సమన్వయాన్ని కూడా పెంపొందిస్తుంది.సృజనాత్మక ఆలోచనలు: నేటి పోటీ ప్రపంచంలో సరికొత్త ఐడియాలతో ముందుకొచ్చిన వారినే విజయం వరిస్తుంది. మనలో దాగిన అలాంటి కొత్త కొత్త ఐడియాలను వెలికితీసేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తుల్లో దాగిన నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికి తీస్తుంది.
ఒత్తిడి దూరం: యోగా ఆందోళన, డిప్రెషన్ ను మాయం చేయడంతో మనిషిలో అపనమ్మకాన్ని పోగొడుతుంది. ఫలితంగా ఆత్మన్యూనత దూరమై ప్రతి మనిషిలో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను వెలికితీస్తుంది. సామాజిక బంధాలు బలోపేతం చేయడంతో పాటు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆందోళన, ఆత్రుత వ్యక్తిలో దాగిన ప్రతిభను నాశనం చేసి వారిని డొల్లగా మారుస్తుంది. యోగా ఇలాంటి ఒత్తిడులు, టెన్షన్లను దూరం చేసి మనిషిలో దాగిన అద్భుతమైన శక్తుల్ని బయటకు తీసుకొస్తుంది.యోగా – పాశ్చాత్య ప్రపంచం : యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాలు వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. మనస్సును శ్వాసప్రక్రియపై చేసి ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చును. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే నిపుణుల తగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. అందుకే మనమూ రోజూ యోగా సాధన చేద్దాం. శారీరక, మానసిన రుగ్మతల్ని దూరం చేసుకుందాం.
– డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్




