నేడు ప్రపంచ యోగా దినోత్సవం
యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ‘‘యుజ’’ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. జూన్ 21నే యోగాడేను జరు పుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్ 21.. ఉత్తరా ర్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచం లోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు పగలు ఎక్కువగా ఉన్న రోజుగా ప్రత్యేకత కూడా ఉంటుంది. ఆ గుర్తింపు తోనే .. అదే రోజును ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’’గా జరుపు కోవాలని నిర్ణయించారు. యోగా ఇప్పటిదేమీ కాదు.. దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపు దిద్దుకున్నవే. ‘అ ‘ పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగా ఉందని పరిశోధనల్లో తేలింది. యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే ‘‘యోగా డే’’ ముఖ్య ఉద్దేశం. యుగయుగాలుగా మన సనాతన భారత సంప్రదాయంలో ఇమిడి ఉండి, పూర్వీకులెందరో తమ శారీరక, మానసిక ఉల్లాసానికి అనాదిగా ఆచరించిన సాధనం ‘యోగ సాధన’. ప్రాచీన కాలం నుండి ఎందరో మునులు, యతులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ‘‘ఆసనాలు’’, ఆచరించిన శ్వాస సంబంధిత ‘‘ప్రాణాయామాలు’’, క్రమంగా మనకు ‘యోగా’ పాఠాలుగా మారాయి అనడం అతిశయోక్తి కాదు ఆ కాలంలోనే ‘పతంజలి’ మహర్షి మన వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా స్వయంగా ‘యోగ దర్శిని’ అనే గ్రంథాన్ని రచించారు. ఈ తాళ పత్ర గ్రంథం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా, ఎందరో యోగా గురువులు తమ సాధనలను, అనుభవాలను రంగరించి వేలాది యోగా పుస్తకాలను రంచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నారు. పతంజలి మహర్షి భావనలో యోగా అనేది ‘అష్టాంగ యోగం’. అంటే ఈ యోగా అనే శాస్త్రాన్ని ‘‘యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి’’ అనే ఎనిమిది భాగాలుగా విశ్లేషించి చెప్పారు పతంజలి మహర్షి. ఈ ప్రాచీన పద్ధతులను ఆచరిస్తూ విశ్వవ్యాప్తంగా ఎందరో యోగ సాధకులుగా, యోగా గురువులుగా కొనసాగుతున్నారు. యోగాకు సంబంధించిన యోగశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. భారతదేశంలో పురుడు పోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది. అందుకే.. యోగాను ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం ప్రతి సంవత్సరం యోగాడేను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో యోగా డేను నిర్వహిస్తారు. 2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్సన్ అభిప్రాయం. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు. అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిస్సన్ వివరించారు. జూన్ 21 న యోగా దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు. 2014లో మోదీ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. 2015, జూన్ 21 ప్రపంచ వ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. భారత్లో ప్రధాని మోదీ.. న్యూఢిల్లీ లోని రాజఢ్ లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆరోజు ప్రధాని మోదీతో పాలు వేల మంది యోగా చేశారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35985 మంది ఆరోజు మోదీతో పాటు యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతోందని చాలామంది అంటుంటారు. కానీ, రోజూ సమయం దొరికనప్పుడు చిన్నచిన్న యోగా ఆసనాలు వేయడం మొదలుపెడితే ప్రశాంతత మెరుగు పడుతుంది. గడచిన శతాబ్ద కాలంలో ప్రపంచీకరణలో భాగంగా యోగా కూడా అనేక రూపాలు తీసుకుంది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో యోగాకు ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది. నిత్యం మన దైనందిన జీవితంలో ఎదురయ్యేపలురకాల వ్యాపకాల మూలంగా తెలియకుండానే మనం శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతుండడం సహజం. తద్వారా అనారోగ్యంతో రోగాల బారిన పడడమే కాకుండా మానసిక ఆందోళనలతో ప్రశాంతతను కోల్పోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుత తరుణంలో ‘యోగ’ సాధనకు మించిన సాధనం మరొకటి లేదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ‘యోగా’తో శారీరక మానసిక రుగ్మతలకు చెక్ పెట్టి అసలైన ఆరోగ్య, ఆనంద ‘యోగా’న్ని మనం సంపూర్ణంగా అనుభవించవచ్చు. ఏ ఆసనం ఎలా వేయాలో అవగాహన ఉంటే చాలు… యోగాను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు. యోగాకు వయసు అడ్డంకి కాదు. చాలామంది ఏడు పదుల వయసులో యోగా చేయడం మొదలుపెడతారు. తాము ఇంకా ముందే ప్రారంభించి ఉంటే బాగుండేదని వారు చెబుతుంటారు. అన్ని వయసుల వారికీ ప్రత్యేకంగా కొన్నిరకాల యోగా ఆసనాలు ఉంటాయి. యోగా అనేది ఒక రకమైన ‘‘వ్యాయామం’’. అది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయొచ్చు. శారీరక వైకల్యంతో కుర్చీలోంచి లేవలేని వారికోసం కూడా ప్రత్యేకంగా ‘ఛైర్ యోగా’ ఉంది. పతంజలి మహర్షి ‘యోగ దర్శిని’ ఆధారంగా హరిద్వార్ కేంద్రంగా ‘రాందేవా బాబా’ స్థాపించిన పతంజలి యోగా ఆశ్రమం కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ యోగా కేంద్రా లను నడుపుతున్నది. శారీరకంగా దృఢంగా ఉన్నవారే యోగా చేయాలన్న షరతు కూడా ఏమీ లేదు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. ఫిట్నెస్ కు తగ్గట్టుగానే ఆసనాలను ఎంచు కోవచ్చు. యోగాతో మనసుకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో, మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయ వాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగు పడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగ పడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ‘ప్రసవానంతర యోగా’ ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది. విద్యార్థులు రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి. వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శారీరక పరమైన సాధనలతో కండారాలు దృఢంగా తయారవుతాయి.
– రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494




