- 8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం
- భక్తులంతా తమిళనాడు వాసులగు గుర్తింపు
- సహాయక చర్యల చేపట్టిన కేరళ పోలీసులు
తిరువనంతపురం, డిసెంబర్ 24 : శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న టెంపో కేరళలోని ఇడుక్కి జిల్లా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా వాగులోకి బోల్తా పడింది. స్థానికులు ఆ ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమచారం అందించారు.
దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా టెంపోలో ఓ చిన్నారితో సహా తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను కుమిలిలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈఘటన గురించి ఇడుక్కి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందడంతో.. అర్ధరాత్రే అక్కడకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సహాయంతో క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదం శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు థేనీ జిల్లాలోని అండిపెట్టి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



