- ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి రావాలి
- కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి పాలమూరును పచ్చగా చేస్తున్నాం
- కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వొస్తాం
- రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : వ్యవసాయ రంగంలో పంజాబ్‌ను తలదన్నే విధంగా అద్భుతాలు సూచించామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండల పరిధిలోగల సంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ కంపెనీకి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లతో కలిసి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రైతు బీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ అని, కానీ నేడు ఇరిగేషన్‌గా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
భవిష్యత్‌లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు అన్నారు. దూరదృష్టితో కేసీఆర్ ప్రత్యామ్నాయం పంటలను ప్రోత్సహిస్తున్నారన్ని సాంప్రదాయ పంటలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే అవకాశం ఉందని గుర్తించి పంటల మార్పిడితో వ్యవసాయం బలోపేతం చేయాలనేదే ముఖ్యమంత్రి లక్షమని ఆయన అన్నారు. ఒకనాడు చెరువు కింద చేను ఉంది అని చెప్పేది..ఇప్పుడు చేను కిందకు చెరువు వొచ్చిందని తాడూరు మండలం ఐతోలు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నామని వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నదాన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులే..కాగా నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హమని అన్నారు.
ఇదే విషయాన్ని వరి ధాన్యం కొనము అని చెప్పిన కేంద్ర మంత్రికి చెబితే క్యా చమత్కారా (అది ఎలా సాధ్యం ) అని అంటే మేమే విమానంతో పాటు హెలికాప్టర్ల్ ఖర్చు భరిస్తాం ఏం జరిగిందో తెలుసుకోండని ఆయనకు చెప్పామని కెటిఆర్ అన్నారు. వరి మాత్రమే సాగు చేయడం భావ్యం కాదని, దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా అయిల్ పామ్ సాగు చేసి ఆదర్శంగా నిలిచారని, దీని ద్వారా రైతులకు భరోసా కలుగుతుందని ఆయన అన్నారు. సాగులో కష్టనష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుగా సాగుచేయడం అభినందనీయమన్నారు. 14 కంపెనీలతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం..అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులకు ప్రోత్సాహమిస్తామని. నాలుగేళ్లలో ఆయిల్ పామ్ పంట చేతికి వొచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చునని మంత్రి కెటిఆర్ అన్నారు. ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్ పామ్ సాగుతో సాధ్యమని, వరి సాగు నుండి రైతులు బయటకు వొచ్చి ఆధునిక వ్యవసాయం వైపు మనందరం కలిసి నడవాలని ఆయన జూచించారు. 2601 రైతు వేదికలతో వ్యవసాయ విస్తరణ అధికారులను అందుబాటులో ఉంచామన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వొస్తాం
మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మళ్లీ గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉపాధి.. అవసరమైతే యువతకు ప్రభుత్వం నుండి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇకనే ఉపాధి కల్పిస్తున్నట్లు అని తెలిపారు. ఆహారశుద్ధి పరిశ్రమలకు పెద్ద పీటతో.. భవిష్యత్‌లో తెలంగాణలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్లు రజనీ సాయిచంద్, వాల్యా నాయక్, ఆంజనేయ గౌడ్ , జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి జిల్లా ఎన్నికల కో కన్వీనర్ వంగూరు ప్రమోద్ కుమార్ రెడ్డి. వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్. జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ చైర్మన్ కురుమూర్తి యాదవ్. ఎత్తం రవి. ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి. వామన్ గౌడ్ మాజీ జెడ్పిటిసి విశ్వేశ్వర్. మాజీ సర్పంచ్ చెన్నకేశవరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.



