నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
1944లో ఓరుగల్లు జిల్లాలో ఆంధస్రారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కవులు, కళాకారులు కవి సమ్మేళనం జరపడానికి పూనుకున్నారు. కవి సమ్మేళనం జరుగుతున్న విషయాన్ని నాటి రజాకారులు పసిగట్టారు. సమ్మేళనాన్ని ఆపేందుకు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు, కవులు వేదికపై ఆసీనులై ఉన్నారు. కవి సమ్మేళనం ప్రారంభానికి వేదిక సిద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా సభా ప్రాంగణంలోకి రజాకారులు ప్రవేశించారు. వేదిక దగ్గరలో ఉన్న పందిర్లను తగులబెట్టారు. ఓ వైపు అగ్ని జ్వాలా ఎగిసిపడుతోంది. ఈ నేపథ్యంలో కవులు జ్వాలలో ఆహుతి అయిపోతాము కాని కవి సమ్మేళనం ఆపే ప్రసక్తి లేదని భీష్మించుక కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో దాశరథి అందుకున్నారు ఓ పద్యరూపం.. ఓ పరధీను మానవా.. ఓపరాని దాస్యం విధల్చలేని శాంతమ్ము మాని తలపులను ముష్టిబంధాన కలచి వలచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్రమ్ము స్వర పురమ్ము…. ఇలా ధారాళంగా పద్యాలు చదువడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మరో కవి సురవరం ప్రతాపరెడ్డి సభకు అధ్యక్షత వహిస్తున్నారు. దాశరథి పద్యాన్ని ఉద్ధేశిస్తూ ఇలా అన్నాడు. .. నాయనా దాశరథి… సింహపు గర్జన చేశావు అంటూ కీర్తించారు. దాశరథిని స్ఫూర్తిగా తీసుకున్న ఇతర తెలుగు కవులు పద్యాలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరచారు. ఓ వైపు మరో మారు రజాకారుల వేదికపైకి రాళ్లు రువ్వుతున్నారు. రజాకారులు వేస్తున్నవి రాళ్లు కావు అవి పూలుగా బావించాలని చెబుతూ కవులకు భరోసానిస్తూ, మీరు ధిక్కార కవితా గళాలను వినిపించాలని దాశరథి కవులను చైతన్యపరచిన తీరు ప్రజను ఆకర్శించింది. బీభత్సమైన ఈ పోరాటంలో చివరకు రజాకారులు వెనుతిరిగారు.
ఇదే సంవత్సరం 1944లో మానుకోట తాలూకా(ఇప్పటి మహబూబాబాద్) జిల్లాలోని మారుమూల గ్రామమైన జయ్యారంలో ఆంధ్రమహాసభ నిర్వహించారు. ఈ సభకు కవులు, మేథావులు హాజరయ్యారు. ఇక్కడే నిజాంకు వ్యతిరేక నినాదాల బీజం పడింది. ఓ వైపు స్వాతంత్య్రపోరాటం, మరో వైపు నైజాం పాలన విముక్తి అనే అంశంపై హోరాహోరిగా పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జయ్యారం గ్రామ వాసులు, ఇతర కవులు, తెలంగాణ వాదులు ముక్తకంఠంలో నిజాం ముర్దాబాద్ నినాదాలు చేస్తూ మరో వైపు మహాత్మగాంధీజీకి జిందాబాద్ నినాదాలు చేశారు. ఇదే సమయంలో రజాకారులను తమ గ్రామానికి అడుగుపెట్టనివ్వబోమని స్థానిక ప్రజలు ప్రతినబూనారు. సభ ముగిసేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. అదే రోజు దాశరథి పక్కనే ఉన్న చిన్నగూడూరుకు కాలినడకనే బయలు దేరారు. చిన్నగూడూరుకు చేరిన విషయం గూఢచారుల ద్వారా నిజాం ప్రభుత్వానికి విషయం తెలిసింది. అక్కడే దాశరథిని బంధించి తీసుకెళ్లారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో బంధించారు. ఖైదీ ముద్రవేసి దాదాపు పది మైళ్ల దూరం నడిపించారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్ నుంచి దాశరథిని వరంగల్ జైలు తరలించే క్రమంలో పోలీసుల కళ్లుగప్పి దాశరథి తప్పించుకున్నారు .నిజం సైన్యం వెంబడించినా వారికి దొరకకుండా వెళ్లిపోయారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1947 అజ్ఞాత వాసంలో ఉంటూ కవిత్వం రాసేవారు. ఆ రోజుల్లో హిందువులను ముస్లింలుగా మార్చడానికి నిజాం రాజు చేస్తున్న ప్రయత్నాన్ని స్వామి రామానందతీర్థ అడ్డుకున్నారు. వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో అజ్ఞాతంలో ఉండి కూడా కవితలను వినిపించారు దాశరథి. ‘ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను ఖదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను జగత్తంతా రగుల్కొన్న కృధా జ్వాలా వృదా పోదు.. దగాకోరు బటా చోరు రజాకారు పపోషకుడవు దిగిపొమ్మని జగత్తంతా నగరాలుకొడుతున్నది దిగిపోవోయ్ తెగిపోనోయ్ ’ ప్రేక్షకుడి వలే కాక ప్రజల కష్టనిష్టూరాలతో తానొకడుగా కలిసిపోయాడు. అజ్ఞాతవాసం గడిపిన అనంతరం భారత స్వాతంత్య్రానికి ముందు 1947 ఏప్రిల్‌మాసం నుంచి మొదలుకొని 16 నెలలు పాటు జైలు జీవితం గడిపారు.
వట్టికోట అళ్వారుస్వామితో పరిచయం
1948లో దాశరథితో పాటు మరో ముప్పై మంది ఖైదీలను వరంగల్ జైలునుంచి నిజామాబాద్ జైలుకు తరలించారు. అక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదట ఆయనకు కనిపించిన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి. ఆ సమయంలో అళ్వారు చిన్నటోపీ నెత్తిన పెట్టుకుని చాలీచాలని గీట్ల అంగీ(చొక్కా) వేసుకుని నీళ్ల పంపు వద్దకు వచ్చాడు. నీళ్ల పంపు వద్ద ఏర్పడిన పరిచయం తెలంగాణ సాధన, నిజాం పాలన విముక్తి కోసం పథకాలు వేసేవారు. ఆళ్వారు కవులంటే అమితమైన అభిమానం.. ఆయనకు నిజాంకు వ్యతిరేకంగా రాసిన విప్లవాత్మక రచనల కోసం కూతూహలపడేవారు. విప్లప రచనలపై ఆమితమైన ఆసక్తి కనబరుస్తూ కవులను మరో మారు వినిపించాలని కోరేవారు.
వట్టికోట ఆళ్వారుస్వామి కోరిక మేరకు .. దాశరథి నిజామాబాద్ జైల్లో పలు కవితలను గోడలపై రాసి నిరసన వ్యక్తపరచేవారు. ఓ రోజు జైలు గోడపై రాశాడు ఓ పద్యం ‘ ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలిన రాజు మా కెన్నడేని తీగెలను తెంపి అగ్నిలోకి దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాశాడు. ఈ పద్యాన్ని ఆళ్వారు కంఠస్తం చేశారు. గోడ మీద రాసిన పద్యాన్ని జైలు అధికారులు చెరిపేవారు. ఇలా చెరవడం వారి వంతు అయితే ఇదే పద్యం మరో గోడమీద ప్రత్యక్ష్యం కావడం మరో వంతు.. ఇలా రాసిన పద్యాలు దాశరధి రాస్తున్నారని జైలు అధికారులు భావించేవారు. చివరకు ఈ పద్యం ఎక్కువ సార్లు రాసింది ఆళ్వారు అని జైలు అధికారులు గ్రహించారు. ఇలా మూడు నెలల పాటు వారిరువురు నిజామాబాద్ జైల్లో గడిపారు. చివరకు ఆల్వారు గుల్బర్గా జైలుకు దాశరథిని హైదరాబాద్ జైలుకు పంపించారు. ఆళ్వారుమరణించినా .. ధాశరథి హృదయపలకంపై నిలిచి ఉంటాడని ఆయన అభిప్రాయం. వారిద్దరు స్నేహానికి గుర్తుగా అగ్నిధార కవితను అంకితమిచ్చారు. అ తరువాత 1948లో భారత సైన్యం హైదరాబాద్‌రాష్ట్రాన్ని చుట్టిముట్టి బందీలుగా యావత్ రాజకీయ ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణ ప్రాంతాన్ని భారత్ యూనియన్‌లో విలీనం చేసిన విషయం విదితమే …
– భర్తపురం వెంకటమల్లేష్,
మరిపెడ బంగ్లా , 9949872371




