విలక్షణ నటుడు కైకాల కన్నుమూత

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 23 : ‌విలక్షణ, సీనియర్‌ ‌నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ‌ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 60 ఏండ్లపాటు చిత్రపరిశ్రమకు సేవలందించిన కైకాల..1935, జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు.
మొత్తం 777 సినిమాల్లో నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి ప్రాత్రల్లో మెప్పించారు. హీరో, విలన్‌, ‌కమెడియన్‌, ‌క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆయన అన్నివర్గాల ప్రేక్షకుల హృదాయలను గెలుచుకున్నారు. చివరిసారిగా బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్‌ ‌జీవిత చరిత్ర ’మహానటుడు’ చిత్రంలో వెండితెరపై కనిపించారు. 1994లో బంగారు కుటుంబం చిత్రంలో అద్భుతనటనకుగాను కైకాలకు నంది పురస్కారం లభించింది. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలుపొందారు. పౌరాణికం.. సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలకు తన నటనతో వన్నె తెచ్చారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు.
ముఖ్యంగా టాలీవుడ్‌ ‌ప్రేక్షకులకు కైకాల యముడిగా సుపరిచితులు. గతేడాది కోవిడ్‌ ‌బారిన పడిన తర్వాత..కైకాల అనారోగ్యానికి గురైనట్లు  తమ్ముడు కైకాల నాగేశ్వర రావు చెప్పారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌ ‌రావు సంతాపం ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసిఆర్‌ ‌విచారం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్‌ ‌తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు’. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులునివాళులు అర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *