విద్వేష పూరిత ప్రసంగాలు ..!

సార్వత్రిక ఎన్నికల ఐదవ  దశ పోలింగ్‌ ‌సోమవారం  ముగియడంతో దాదాపు 80 శాతం నియోజకవర్గాల ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి.. ఆరవ దశ పోలింగ్‌ ‌మే 25..ఆఖరి దశ పోలింగ్‌ ‌జూన్‌ 1‌న జరగనుంది. మిగిలిన 20 శాతం సీట్లపై దృష్టి మళ్లడంతో తాజా వాదనలు మరియు వాగ్దానాలతో ప్రధాన రాజకీయ పార్టీల ఉపన్యాసాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలు మొదటి అయిదు దశ పోలింగ్‌ ‌సరళిని బట్టి ఎన్నికల్లో విజయం సాధించామని, 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ప్రతిస్పందనగా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే, అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, అన్ని దశల్లోనూ తమ సీట్లు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ  మూడవసారి ప్రధాన మంత్రిగా  దేశాన్ని సత్వర ప్రగతికి అంకితం చేయడం గురించి మాట్లాడుతుండగా, హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా పిఓకె(పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌) ‌ను మళ్లీ భారతదేశంలో భాగం చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. బీహార్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ‘‘హమ్‌ ‌పాకిస్తాన్‌ ‌కో చూడియాన్‌ ‌పహానా దేంగే.’’ (మేము పాకిస్థాన్‌ ‌చేతికి గాజులు ధరించేలా చేస్తాం) అన్నారు. ఇంతకుముందు, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, కాస్త  వివేకంతో ఇటువంటి విషయాలు ప్రస్తావించినప్పటికీ ..ప్రధానమంత్రి, హోమ్‌ ‌మంత్రి బహిరంగ వేదికలపై ఇంత ఘాటైన పదాలు వాడడం ఇది తొలిసారి కాదు.

భారత కూటమి తరపున ఖర్గే ఉచిత ధాన్యం పంపిణీని 10 కిలోలకు రెట్టింపు చేస్తామని మరియు ఉద్యోగ రిజర్వేషన్‌ ‌పరిమితిని 50 శాతం మించి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమేనా? ఈ విషయంపై సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యుడు వివరణ ఇస్తూ బ్రెజిల్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. బ్రెజిల్‌లో ‘ఫ్రీబీలు’ అత్యుత్తమ ఫలితాలను సాధించాయని, కాబట్టి భారతదేశంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వొచ్చే నష్టం లేదనీ ..సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన స్వరం మార్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు  జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు 40 సీట్ల కంటే తక్కువగా వొస్తాయన్న ఆమె ఇప్పుడు ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా 300 సీట్లు వొస్తాయని, బయటి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తృణమూల్‌ ‌మద్దతు ఇస్తుందని స్పష్టం చేసారు.

రెండు కూటముల మధ్య సవాళ్లు ..ప్రతి సవాళ్లు భిన్న వాదనలు, అభిప్రాయాలు సహజమే ..! కానీ ప్రజాస్వామ్యానికి హాని కలిగించే విద్వేష పూరిత ప్రసంగాలు దేశ భవిష్యత్తుకు హానికరం అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. గుడి, మసీదు, హిందూ, ముస్లిం, పాకిస్తాన్‌, ‌కబ్రీస్థాన్‌-‌షంషన్‌, ఔరంగజేబు, రంగు మరియు కులం వంటి విభజన మరియు విషపూరిత పదాలు ప్రజల్లో విష బీజాలు నాటుతాయి.  కులం, మతం, ప్రాంతం, భాష, లేదా వర్గాలపై ఆధారపడిన రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. భవిష్యత్తు తరాల మనస్సులను విషపూరితం చేస్తున్న కొందరు రాజకీయ నాయకుల ప్రసంగాలు  డెబ్బై మరియు ఎనభైలలో పంజాబ్‌లో మరియు ఆ తర్వాత రెండు దశాబ్దాలలో కాశ్మీర్‌లో జరిగిన సంఘటనలు దీనికి భయంకరమైన ఉదాహరణ. తటస్థంగా ఉండాల్సిన, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాల్సిన ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం పలు అనుమానాలను, సందేహాలను కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *