విద్యుత్‌ ‌షాక్‌తో అయినాపూర్‌ ‌గ్రామంలో వ్యక్తి మృతి

  • అధికారుల నిర్తక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
  • దిర్సంపల్లి సబ్‌ ‌స్టేషన్‌ ఎదుట ఆందోళన

పరిగి, ప్రజాతంత్ర, జూలై 27 : పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని అయినాపూర్‌ ‌గ్రామంలో బుసని బాలరాజ్‌ అనే వ్యక్తి విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి మృత్యువాత పడడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయాకే స్పందిస్తారా…సమస్య ఉందని ముందే చెప్పినా ఎందుకు పట్టించుకోరంటూ పరిగి నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయని మండిపడ్డారు. సమస్య ఉందని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

పరిగి నియోజకవర్గం దోమ మండల విద్యుత్‌ ‌శాఖ అధికారుల పనితీరు పట్ల పలువురు మండిపడుతున్నారు. కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ కరెంటు సమస్యల పరిష్కారం మీద లేదంటూ మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి మృత్యువాత పడుతున్నారని, ఇలా ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే విద్యుత్‌ ‌శాఖ అధికారులు స్పందించి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ ‌శాఖ అధికారుల పనితీరును నిరసిస్తూ దిర్సంపల్లి సబ్‌ ‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఏఈ డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ నినాదాలు చేస్తూ సబ్‌ ‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

గ్రామంలో కరెంటు సమస్య ఉందని పలుమార్లు విద్యుత్‌ ‌శాఖ ఏఈకి చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ, విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి చనిపోయిన బాలరాజ్‌ ‌కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ ‌చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఏఈని పిలిపించడంతో బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఏఈ అందజేశారు. అదే విధంగా విద్యుత్‌ ‌శాఖ నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలి : దోమ మండల కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
‘‘అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు కేవలం కలెక్షన్‌ ‌మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు. చినుకు పడితే చాలు కరెంటు కోతలు. ఎక్కడి సమస్యలు అక్కడే. గ్రామస్థాయిలో ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న దోమ మండల విద్యుత్‌ ‌శాఖ సిబ్బందిపై చర్యలు చేపట్టాలి.’’ అని దోమ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *