విద్యాలయాల్లో పెడధోరణలు

‘‘ ‌సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం ఊరుకోదన్న సంకేతాలు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు.’’

విద్యారంగం భ్రష్టు పట్టిపోతోంది. విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. వారిలో మానసిక ఆందోళన పెరుగు తోంది. ప్రశాంత వాతావరణంలో విద్యను ఆస్వాదించే అవకాశాలు లేకుండా పోయాయి. విద్య మొత్తం ఒత్తిడిలోనే సాగుతోంది. ఎల్‌కెజి నుంచి…పిజి వరకు అంతా ఒత్తిడిమయంగా మారింది. దీనికితోడు విద్యలో నైతిక విలువలు లోపించాయి. నైతిక విలువలను నేర్పే పాఠ్యాంశాలు చిన్ననాటి నుంచే నేర్పించాల్సిన గురువులు..పిల్లలను కేవలం పుస్తక పురుగులుగా తయారు చేస్తున్నారు. బట్టీపట్టించే విధానాలు ఎక్కువ య్యాయి. విషయ పరిజ్ఞానం లేకుండా చేస్తున్నారు. విద్యార్థుల్ల్లో సోదరభావం నశించింది. ఇతరలును గేలిచేయడం లేదా వేదించడం ఎక్కువయ్యింది. అలాగే కాలేజీకి చదువుల కోసం కాఉండా అమ్మాయిలను ట్రాప్‌ ‌చేయాలని వస్తున్న వారు కూడా ఉంటున్నారు. ఇలాంటి మృగాళ్లతో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. బేటీపడావో..బేటీ బచావో అన్నది నినాదంగానే మిగిలింది.

ఇకపోతే ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలో ఏం జరుగుతోందో పెద్దగా పట్టించుకోవడం లేదు. పాఠశాలలు, కళాశాలల్లో ఏం జరుగు తుందో గమనించడం లేదు. ఆరోపణలు వచ్చినా..ఆత్మహత్యలు, వేధింపులు, మర్డర్‌ ‌కేసులు వరుసగా కలవర పెడుతున్నా కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. కారణాలను అన్వేషించడం లేదు. మెడికో ప్రీతిని సీనియర్‌ ‌మెడికో సైఫ్‌ అన్న దుర్మార్గుడు టార్చర్‌ ‌పెట్టడంతో ఆమె ఆత్మహత్యచేసుకుంది. ప్రేమ కోసం ఓ యువకుడు తోటి స్నేహితుడు నవీన్‌ను కిరాతకంగా చంపేశాడు. మరో ఇంజనీరింగ్‌ ‌విద్యార్థిని రక్షితను ర్యాగింగ్‌ ‌చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా సాత్విక్‌ అనే ఇంటర్‌ ‌విద్యార్థి కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా పిల్లల జీవితం అర్థాంతరంగా ముగియడం అన్నది తల్లిదండ్రులకు కడుపుకోతగా మిగులుతోంది. తమ పిల్లలు క్షేమంగా, ప్రయోజకులుగా తిరిగి వస్తారన్న నమ్మకం లేని విద్యావ్యవస్థలో మనం బతుకుతున్నాం. కార్పోరేట్‌ ‌కాలేజీలు, స్కూళ్లలో దోపిడీలు జరుగుతున్నా ప్రభుత్వాలు మిన్నకుంటు న్నాయి. వారినుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు మరిగిన అధికారులు, నాయకులు వారికి వత్తాసుగా నిలుస్తు న్నారు.

ఫీజులు కట్టించుకోవడం..ఒత్తిడి పెంచడం, ఆత్మహత్యచేసుకుంటే మిన్నకుండడం అలవాటుగా చేసుకున్నారు. ఇతంటి దౌర్భాగ్యం నిత్యం మనం కళ్లారా చూస్తున్నాం. నిజానికి మెడికో ప్రీతి విషయంలో సీనియర్‌ ‌విద్యార్థి వేధింపులపై ఫిర్యాదు అందగానే కఠినంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఘటన జరిగిన తరవాత కఠినంగా హెచ్చరించడం కాదు…ఘటనలు జరక్కుండా కఠినంగా ముందే హెచ్చరి కలు జారీచేయాలి. ర్యాగింగ్‌కు పాల్పడే వారిని చదువుకు దూరం చేయాలి. అలాంటి వారి తల్లిదండ్రలును పిలిపించి కౌన్సిలింగ్‌ ‌నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం ఊరుకోదన్న సంకేతాలు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు.

నిజానికి ఇవన్నీ చాలా సీరియస్‌ ‌సమస్యలు. వీటిని పరిశీలించి…ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇది ఏ ఒక్క నగరానికో లేదా రాష్టాన్రికో పరిమితం కావడం లేదు. దేశభవిష్యత్తు తరగతి గదులలోనే రూపుదిద్దుకొంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ అన్నారు. కానీ  ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులకు తాజాగా జరుగుతున్న ఘటనలు అద్దం పడుతున్నాయి. పిల్లల భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉండబోతోందో అర్థం అవుతుంది. నైతికతలేని విద్యకు  వ్యతిరేక విధానాలకు ముగింపు పలకాలి. వ్యాపారంగా మారిన విద్య కారణంగా పేదలకు, సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి రాకుండా చేస్తున్నారు. లక్షలు పోసి చదువులు కొనడంతో పాటు.. పిల్లను పొట్టన పెట్టుకుంటున్నా ప్రభుత్వాల్లో చలనం కానరావడం లేదు. ఇలా ఎంతకాలం మిన్నకుండాలో చర్చించాలి. విద్యార్థుల మధ్య అంతరాలు పెంచే ప్రైవేటు విద్య క్రమంగా కోరలు చాస్తోంది.

కులాలవారీ విద్యను నేర్పడం అవసరమా అన్నది పాలకులు ఆలోచన చేయాలి. అమెరికా,యూరప్‌ ‌వంటి దేశాల్లో మాదిరిగా ఇక్కడ అందరికీ ఒకేరకమైన విద్య అందుతుందా అన్నది ఆలోచన చేయాలి. విద్యారంగంలో చోటుచేసుకొంటున్న మార్పులే కావచ్చు..పెడధోరణులే కావచ్చు..పసిగట్టి పరిష్కరించాల్సింది పాలకులే. లేదా మేధావుల సూచనలను అయినా పాటించాలి. రాజ్యాంగం ఇచ్చిన ఉచిత విద్య హా గాలికి  కొట్టుకుపోయింది. తాజాగా జరుగుతున్న విపరీత పరిణామాల నేపథ్యంలో ఎటువంటి విద్యా విధానం ఉండాలో, ఎలాంటి వాతావరణం కల్పించాలో చర్చించాలి. విద్యావంతులు, మేధావులు, వైస్‌ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, తల్లిదండ్రులతో సెమినార్లు, చర్చలు నిర్వహించాలి.

వారి అభిప్రాయాలు తీసుకోవాలి. రక్షణతో కూడిన విద్యను అందించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాభివృద్ధిని ప్రభుత్వం ప్రాధాన్యతారంగంగా స్వీకరించాలని పలు సందర్భాల్లో మేధావులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. విద్యను ప్రాధాన్యతాంశంగా స్వీకరించకపోగా దానికి ఏ మాత్రం విలువనివ్వటం లేదు. ఇకపోతే ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు అతి తక్కువ నిధులు కేటాయిస్తున్న తీరు కూడా ప్రైవేట్‌ ‌దోపిడీకి ఉపకరించేలా తయారవుతున్నది. ఇది ఓ రకంగా ప్రభుత్వమే తన బాధ్యతలను విస్మరించేలా చేసుకుంటోంది. ఈ పెడధోరణలను పారద్రోలి నైతికతతో కూడిన..భవిష్యత్‌ను బంగారుమయం చేసే విద్య కోసం పాటుపడాలి.
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *