ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచడం పిల్లలను సామాజిక సమభావనను పెంపొందించడం పోషకాహారం లోపానికి రక్తహీనతకు చెక్ పెట్టడం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులలో ప్రోటీన్ లోపాన్ని నివారించుటకు, వారి ఎదుగుదలకు పోషక పదార్థాలు అందించుటకు వారానికి మూడు రోజులు గుడ్లు, మూడు రోజులుగా రాగిజావ అందిస్తున్నది. ప్రభుత్వ బడులలో విద్యనభ్యసించే పిల్లల కుటుంబాల నేపథ్యానికి ఒక్కసారి పరిశీలిస్తే … రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబాలది. వారి తల్లిదండ్రులు దినసరి కూలీలు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఉదయాన్నే వ్యవసాయ , కూలీ పనులకు వెళ్లిపోతారు.
మెనూ ఆనందదాయకం
పాఠశాలలో అల్పాహారం ప్రతిరోజు ఉదయం 9:30 నిమిషాలకు విద్యార్థులకు అందించనున్నారు. సోమవారం గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం బియ్యం రవ్వ కిచిడి, చట్నీ, బుధవారం బొంబాయి రవ్వ ఉప్మా, సాంబార్ , గురువారం రవ్వ పోంగల్ ,సాంబార్, శుక్రవారం మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్, శనివారం గోధుమ రవ్వ కిచిడి, సాంబార్ ఇవే కాకుండా ఆ రక్తహీనతను నిరోధించే చిక్కి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచే ఆకుకూరలతో కూడిన పదార్థాలు చేరిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు . ప్రభుత్వ బడులలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాల 1వ నుండి 5వ తరగతి విద్యార్థులకు 5:45 రూపాయలు , ప్రాథమికొన్నత పాఠశాలలో 6వ నుండి 8వ తరగతి విద్యార్థులకు 8 :45 రూపాయలు, ఉన్నత పాఠశాల 9,10 తరగతి విద్యార్థులకు 10: 67 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నది. అదనంగా ఒకటి నుండి 8వ తరగతుల విద్యార్థులకు కొడిగుడ్డు ఖర్చును ప్రభుత్వమే అదనంగా 5:00 రూపాయాలు చెల్లిస్తున్నది. ప్రస్తుత నిత్యావసర కూరగాయల ధరలు ఆకాశం అంటున్న తరుణంలో ప్రభుత్వం ఏ మేరకు ధరలు ఖర్చు చేస్తుందో అర్థం అవుతుంది.
నిర్ణయం గొప్పది అయినా ఆచరణలో ఏ మేరకు అల్పాహారం పథకం సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లింపులు కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో అల్పాహారం పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారికి పని గంటలు , వంట సమయం పెరుగుతుంది. మధ్యాహ్న భోజన నిర్వహణ అల్పాహారం రాగి జావా పంపిణీ తదితర కార్యక్రమాలను ఉపాధ్యాయుల తలకు మించిన భారంగా మారే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. బియ్యం పంపిణీ వాటి లెక్కలు బిల్లులు తదితర పనులకే సమయం వెచ్చించడంతో బోధన సజావుగా సాగడం లేదు.
తెలంగాణలో ‘మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడి’ పథకం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన వసతులు, ఆధునిక సౌకర్యాలు, కల్పిస్తున్నారు. విద్యాబోధనలో మార్పులు తెస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం అందించడంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) సౌకర్యంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
లకావత్ చిరంజీవి నాయక్
వరంగల్





