అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : వికసిత్ భారత్ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది మోదీ గ్యారంటీ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలుగు మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, నక్సలైట్ల భరతం పడుతున్నామని తెలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడంతో అవినీతిపరులు జైళ్లలోకి పోయారని చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, రాబోయే రోజుల్లో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని..ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఏ అంశంలోనైనా..భారత్ ఏం చెబుతుందా అని ఇవాళ ప్రపంచమంతా చూస్తుందని దానికి కారణం మోదీనే అని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఉండేందుకు ఇల్లు అందిస్తామని, దేశంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో భారత్‌ను మళ్లీ విశ్వగురువును చేస్తామని తెలిపారు. పేదల కోసం..పీఎం-గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదల ఆకలి తీర్చుతున్న కార్యక్రమం వొచ్చే ఐదేళ్లకు పొడిగిస్తున్నామని పేదలకు ఇండ్లు, స్వచ్ఛమైన తాగునీటితోపాటు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద ‘జీరో కరెంట్ బిల్’ పథకాన్ని తీసురానున్నట్లు చెప్పారు.
అలాగే ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాలు, ఆరోగ్య మందిరాల వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మురికివాడల్లో ఉండేవారికి ఇండ్ల నిర్మాణం మధ్యతరగతి కోసం సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు, జన ఔషధి కేంద్రాలు, ఆయుష్, యోగాను ప్రోత్సహిస్తూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు బాటలు వేస్తామన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంఎస్ లతోపాటు విశ్వవిద్యాలయాలను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మూడుకోట్ల మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులను చేస్తామని, కీలక రంగాలకు అవసరమైన..నైపుణ్య శిక్షణను అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తామన్నారు. వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్, ఏక్తా మాల్, వన్ స్టేషన్..వన్ ప్రొడక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. యువత కోసం..పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తామని, ప్రభుత్వ నియమకాల పక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. దేశాన్ని ఉన్నత విలువలతో కూడిన సర్వీస్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, స్టార్టప్ వ్యవస్థను మరింతగా విస్తరిచడం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు.
వయోవృద్ధులకు నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. సామాజిక భద్రత పథకాల లబ్ధి, ప్రభుత్వ సేవలు వంటివాటిని నిరంతరం ఇబ్బందుల్లేకుండా అందించేందుకు పోస్టల్, డిజిటల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని తెలిపారు. రైతులకోసం పీఎం కిసాన్, పీఎం పంటబీమా యోజన కింద రైతులకు ఆర్థికంగా మద్దతు, మిల్లెట్లను సూపర్‌ఫుడ్‌గా ప్రోత్సహిస్తూ..భారతదేశాన్ని ప్రపంచ మిల్లెట్ హబ్‌గా మార్చుతామని, డైరీ సహకార సంఘాల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తామని, పశువులకు వొచ్చే ఫుట్ అండ్ మౌత్ వంటి వ్యాధుల నివారణ దిశగా ప్రత్యేక దృష్టి పెడతామని, .మత్స్యకారుల బోట్లకు బీమా, ఈ రంగానికి ఇతర మౌలికవసతుల కల్పనను ప్రోత్సహిస్తూ.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను విస్తరిస్తామని తెలిపారు. ప్రాసెసింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం, ముత్యాల వ్యవసాయం, సీ-వీడ్ పెంపకం వంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా మత్స్యకారుల ఆదాయం పెంచుతామని తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించుకున్న ఆటో, టాక్సీ, ట్రక్ డ్రైవర్లు, ఓలా, ఊబర్ రైడర్లకు లబ్ధి చేకూర్చడంతోపాటు అర్హత కలిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులకు విశ్వకర్మ..వర్కింగ్ క్యాపిటల్ (మూలధనం) అందించడం ద్వారా వారి అభివృద్ధిని ప్రోత్సహించేందుకు డిజిటల్ క్రెడిట్ సొల్యూషన్ (డిజిటల్ రుణ పరిష్కారాల)పై దృష్టి పెడతామని తెలిపారు. చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ పోర్టల్‌ను మరింత సరళీకరిస్తామని చెప్పారు. విశ్వకర్మ పరిధిలోకి వొచ్చే కుటుంబాల కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.
చిరు వ్యాపారులు, విశ్వకర్మ కుటుంబాల ఉత్పత్తుల ఎగుమతి వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ‘డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాల’ నెట్వర్క్ ను పెంచుతామని తెలిపారు. గిరిజన పరిశోధన సంస్థలకు నిధులను, గిరిజన పోరాట యోధుల మ్యూజియంలను పెంచి గిరిజన సంస్కృతిని, వారి భాషలను సంరక్షిస్తామని తెలిపారు. ముద్రా రుణాలను రెట్టింపు చేయడం, పీఎం స్వానిధి, పీఎం విశ్వకర్మ వంటి పథకాలను విస్తరించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల జీవన ప్రమాణాలను పెంచుతామని తెలిపారు. విద్య, వైద్యం..ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రా మిషన్‌లో భాగంగా..ఏయిమ్స్, జిల్లా హాస్పిటళ్లలో వైద్య సౌకర్యాలను బలోపేతం చేయడం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అప్‌గ్రేడ్ చేస్తామని కిషన్ రెడ్డి వివరించారు. ప్రపంచ తయారీ రంగంగా భారత్‌ను రూపుదిద్దుతామని, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, చిప్ మేకింగ్ వంటి హైటెక్ మ్యానుఫాక్చరింగ్ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. రైల్వేల సామర్థ్యాన్ని పెంచడం..వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి కొత్తతరం రైళ్లను తీసుకురావడం ద్వారా రైల్వేల ఆధునీకరణకు బాటలు వేస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద, 15 వేల కిలోమీటర్ల ‘ఎక్స్‌ప్రెస్ వే’ నెట్ వర్క్‌ను విస్తరించామని తెలిపారు. ఉగ్రవాద సంస్థలు, వామపక్ష తీవ్రవాదం, వారికి మద్దతిస్తున్న సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని, దేశ రక్షణ, అంతర్గత భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ ప్రకారం..దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి(యునిఫామ్ సివిల్ కోడ్) అమలు చేస్తామని, భారతీయ న్యాయ సహిత అమలుతోపాటు, జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
మోదీ గ్యారంటీపైనే ప్రజల విశ్వాసం..
విభజన రాజకీయాలకు కాంగ్రెస్ కుట్ర
కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు..
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రెండు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలను పరిశీలిస్తే..మోదీ గ్యారంటీనే ప్రజలు విశ్వసిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్రం పేరుతో జారీ చేసిన మేనిఫెస్టోను పూర్తిగా రాహుల్ గాంధీ అన్యాయపత్రంగానే భావిస్తున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బిజెపి మేనిఫెస్టో తెలుగు వెర్షన్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ విభజిత భారత్‌గా మార్చాలని కుట్రలు చేస్తుందని, కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తుందని అన్నారు. మోదీ గ్యారంటీ అంటే..బిజెపి ప్రవేశపెట్టిన సంకల్ప పత్రం అని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, భారతదేశ సమగ్రత, సమైక్యతను కాపాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ సంకల్ప పత్రాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. వికసిత్ భారత్ కోసం బిజెపి పాటుపడుతుంటే.. కాంగ్రెస్ విభజన భారత్ కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతుందని లక్ష్మణ్ మండిపడ్డారు. యూపీఏ దేశాన్ని భ్రష్టుపట్టించిందని, యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడి దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోసం మోదీ నాయకత్వాన్ని విశ్వసించి 2014లో అవకాశం కల్పించారని తెలిపారు. నేడు యూపీఏ కొత్త ముసుగుతో ఇండియా కూటమి పేరుతో వొచ్చిందని, పేరు మారినంత మాత్రాన వారి ఆలోచనలు, విధానాలు మారలేదని, అదే అవినీతిపరులు కుటుంబ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ కష్టకాలంలో కొరోనా సంక్షోభాన్ని అధిగమించి ముందుచూపు ఉన్న నాయకుడిగా రూ. 10 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేసి, ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించారని తెలిపారు.
కాంగ్రెస్ న్యాయపత్రాన్ని పరిశీలిస్తే బ్రిటీష్ ఆనవాళ్లనే కొనసాగిస్తూ, ఆంగ్లేయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ విభజించు-పాలించు మాదిరిగానే ఉందని, కాంగ్రెస్ మేనిఫెస్టో..ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే ఉందన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాల వారీగా రెచ్చగొట్టి వోట్లు పొందే విధంగా మేనిఫెస్టో తీసుకొచ్చారని, అందులో అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి బూతద్దం పెట్టి చూసినా కనపడదని ఎద్దేవా చేశారు. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా బిజెపి సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని కొత్త తరం ముస్లింలీగ్‌గా మోదీ అభివర్ణించారని, పదేపదే మైనారిటీ పదాన్ని ఉచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ..ఎక్కడా కూడా మెజారిటీ వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఇజం పేరుతో మెజార్టీ ఇజాన్ని విస్మరిస్తూ పక్కనపెడుతుందన్నారు. మైనార్టీ ఇజం ఆధారంగా వోటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తుందని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీలు, ఉచితాల పేరుతో వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, మళ్లీ పార్లమెంటు ఎన్నికలతో, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే హామీల అమలు అంటూ ముడిపెడుతున్నారని డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, సేవ, సుపరిపాలన, సంక్షేమమే ధ్యేయంగా మోదీ గ్యారంటీ పేరుతో రూపొందించిన పవిత్రమైన బిజెపి సంకల్ప పత్రాన్ని ప్రజలు అందరూ ఆదరించి గౌరవిస్తారని భావిస్తున్నట్లు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.





