వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 : వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన భార్య నాగమ్మతో కలిసి ఆయన మాట్లాడుతూ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కూలీలతో పని చేయించే తనకు పెద్దమందడి ఎంపీపీ, ప్రస్తుత వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి పరిచయమై ఎస్ఈడబ్ల్యూ సదరన్ కంపెనీలో చాలా పనులు చేశానని, పెద్ద పెద్ద కాంట్రాక్టు చేస్తుంటానని, వనపర్తి జిల్లాలో కూడా రూ.600 కోట్ల ఇరిగేషన్ వర్క్స్ చేశానని నమ్మించాడన్నారు. ఛత్తీస్ ఘడ్ లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇస్తానని హైదరాబాద్ కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న తన ఇంటికీ పిలిపించుకున్నాడని అన్నారు. ఛత్తీస్ ఘడ్ దంతేవాడలో సహకరిస్తే భవిష్యత్ లో మంచి మంచి కాంట్రాక్టులు ఇప్పిస్తానని, అవసరమైతే ఎ అకౌంట్ ఇప్పి స్తానని నమ్మించాడన్నారు. ఈ క్రమంలో 2017 జనవరిలో తాను చత్తీస్ ఘడ్ లో పనులు ప్రారంభించానన్నాడు. అదే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన వనపర్తిలోని గ్రీన్ పార్క్ హోటల్లో వర్క్ ఆర్డర్ కాపీ ఇవ్వడంతో నెలలో 20 రోజులు అక్కడే ఉండి పని చేయించాడన్నారు. బిల్లులు అడిగితే ఇంకా సదరన్ కంపెనీ వాళ్లు ఇవ్వలేదని, కచ్చితంగా ఇస్తారని చెప్పడంతో అప్పు తీసుకొచ్చి పనిచేయించాడన్నారు. అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేయగా, డబ్బులు ఎప్పుడో ఇచ్చామని చెప్పారని తెలిపారు. ఈ విషయంపై మేఘారెడ్డిని అడగగా వందల కోట్ల ఇరిగేషన్ వర్క్ చేశాను, డబ్బులు వడ్డీతో సహా ఇస్తాని, మళ్లీ మళ్లీ అడగకు అని బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. రూ.10 లక్షలు అకౌంటు ట్రాన్స్ ఫర్ చేయగా ఇంకా రూ.3.55 కోట్ల బిల్లులు మాత్రం ఇవ్వలేదన్నారు. ఇంటికి వెళ్తే సెక్యూరిటీ, పోలీసులతో గెంటించి వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బంధువుల అందరి వద్ద రూ.1 కోటి వరకు అప్పు చేశామని మెఘారెడ్డి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబంతో సహా మెఘారెడ్డి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని పర్వతాలు, నాగమ్మ దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, ఈసీ విద్యార్థి సంఘం నేత జిల్లపల్లి అంజి, జాతీయ బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *