వచ్చే పదేళ్లలో నేను సీఎం అవుతా

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వచ్చే 10 ఏళ్లల్లో తాను తెలంగాణకు సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. దాదాపు సీనియర్ నేతలందరూ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తామే సీఎం అభ్యర్థి అంటూ ముఖ్యనేతలందరూ ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, పార్టీకి ఎన్నో సేవలు అందించానని అన్నారు. తాను సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి తెలిపారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపిన క్రమంలో.. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే బాటలో నడవడం గమనార్హం. జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని విషయాలు బయటకు చెప్పలేకపోతున్నానని, లేకపోతే చాలా విషయాలు పంచుకునేవాడినని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, తన భార్య, అనుచరులు కూడా అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *