హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దేశానికి వెన్నెముక రైతు, ప్రజా జీవన ఆధారం రైతు అని తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ(పి.జె.ఆర్.పి) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చుండి శోభన్ బాబు అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమమే లక్ష్యంగా పి.జె.ఆర్.పి పనిచేస్తుందని, పి.జె.ఆర్.పి అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కనిషన్ తనకు క్రేన్ గుర్తును, అలాగే సికింద్రబాద్ నియోజకవర్గం అభ్యర్థి చరణ్ కు డైమండ్ గుర్తును ఈసీ కేటాయించిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా మంచి ఏజెండా ముందుకు సాగుతామని అన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినట్లు తెలిపారు. పి.జె.ఆర్.పికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే దేశానికి వెన్నెముక ఐన రైతులకు అండగా ఉంటామన్నారు. ఆటో కార్మికులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు, కౌలు రైతులకు, వలస కార్మికులకు తెలంగాణ ప్రజా జీవన పార్టీ అండగా ఉంటుందన్నారు. జీ.హెచ్.ఎం.సీ, వాటర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు పర్మినెంట్ చేసేలా పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ అందిస్తామని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల్లో రైతులను అభ్యర్థులుగా నిలబెడతామని చెప్పారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యం





