- సిఎం కెసిఆర్‌కు అధికారిక ఆహ్వానం
- హాజరవుతారా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్రమోదీ రేపు రాష్ట్ర పర్యటనుకు రానున్న సందర్భంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే గతంలో లాగా దూరం ఉంటారా లేక, వరంగల్ సభలో పాల్గొంటారా అన్నది నేడు స్పష్టం కానుంది. ప్రధాని అధికారిక పర్యటన సందర్భంగా ప్రధాని వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం వరంగల్‌లో నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం లభిస్తుంది. ఇప్పుడు కూడా కేసీఆర్‌కు అలాంటి ఆహ్వానం వొచ్చింది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఇంకా ఎలాంటి ప్రకటనా ప్రభుత్వ వైపు నుంచి రాలేదు. రేపటి ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్టస్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పాల్గొనేవన్నీ అధికారిక పర్యటనలే. అయితే ప్రధాని భద్రకాళీ అమ్మవారిని కూడా దర్శించుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలపై ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా..మోదీపై విమర్శలు చేసినా సరే .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం గతంలో ప్రధాని పర్యటనలలో పాల్గొనలేదు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై కేసీఆర్ యుద్ధం దాదాపుగా ఆపేశారు. విమర్శలు కూడా చేయడం లేదు. తప్పని సరి సందర్భం వొస్తే తప్ప..కాంగ్రెస్, బీజేపీ రెండింటిని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వొస్తే ఆయనకు కేసీఆర్ స్వాగతం చెబుతారా లేదా అన్నది చూడాలి.


