- స్వామిని దర్శించుకుని అధికారులతో సవిక్ష
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వెళ్లాలని నిర్ణయించుకున్నా రద్దీలో భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కొండగట్టును ఆలయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.
ఆలయాన్ని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం సవి•క్ష సమావేశం నిర్వహించ నున్నారు. అక్కడే వి•డియాతో కూడా మాట్లాడనున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా పరిశీలించారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఇప్పటికే కొండగట్టు ఆలయ అభివృద్దికి సిఎం వందకోట్ల సాయం ప్రకటించారు. త్వరలో పనులు చేపట్టనున్నారు.




