హైదరాబాద్, పిఐబి, అక్టోబర్ 14 : ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకుపోయే క్రమంలో మరొక చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్‌లను దేశ ప్రజలకు సమర్పణం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి 2022-23 కేంద్ర బడ్జెట్ ఉపన్యాసంలో భాగంగా, దేశానికి స్వాతంత్య్రం వొచ్చి75 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో దేశంలోని 75 జిల్లాలలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్(డిబియు)లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. దేశంలో మూలమూలన డిజిటల్ బ్యాంకింగ్ తాలూకు ప్రయోజనాలను ప్రజలు అందుకొనేటట్లు చూడాలన్న ధ్యేయంతో ఈ డిబియులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఏర్పాటవుతున్నాయి.
ఈ కృషిలో 11 జాతీయ బ్యాంకులు, 12 ప్రైవేటు రంగ బ్యాంకులు మరియు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పాలుపంచుకుంటున్నాయి. ఈ డిబియులను బ్రిక్ ఎండ్ మోర్టార్ అవుట్ లెట్‌ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ప్రజలకు పొదుపు ఖాతాను తెరవడం, ఖాతాలో నిలవ ఉన్న నగదు ఎంత అనేది సరిచూసుకోవడం, పాస్ బుక్‌లో లావాదేవీల వివరాలను అచ్చువేయడం, నిధుల బదలాయింపు, ఫిక్సడ్‌డ్ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, జారీ చేసినటువంటి చెక్కుకు సంబంధించి సొమ్ము చెల్లింపును ఆపివేయాలంటూ ఆదేశించడం, డెబిట్ కార్డు కోసం గాని లేదా క్రెడిట్ కార్డు కోసం గాని దరఖాస్తు పెట్టడం, అకౌంట్ స్టేట్ మెంటును పరిశీలించడం, వివిధ పన్నులను చెల్లించడం, బిల్లులను చెల్లించడం, నామినేషన్‌ను సమర్పించడం మొదలైన అనేక వేరు వేరు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
వినియోగదారులకు అంతగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా బ్యాంకింగ్ ఉత్పాదనలను మరియు సేవలను ఏడాది పొడవునా వారి వీలును బట్టి పొందేందుకు డిబియులు తోడ్పడుతాయి. అవి డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకువొస్తాయి. మరీ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో చైతన్యాన్ని, అలాగే తత్సంబంధిత జాగ్రత్త చర్యలను తీసుకునే అంశాలలో వినియోగదారులకు అవగాహనను కలిగించడంపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక డిబియులు నేరుగా ఇవ్వజూపే సేవల పరంగా గాని లేదా బిజినెస్ ఫెసిలిటేటర్‌లు/ కరస్పాండెంట్‌ల సేవల పరంగా గాని వినియోగదారులకు ఏవైనా సమస్యలు తల ఎత్తేటట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి మరియు రియల్ టైమ్ ప్రాతిపదికన సహాయాన్ని అందించడానికి తగినన్ని పరిష్కార యంత్రాంగాలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా సమకూర్చడం జరుగుతుంది.




