- పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి సాగుతాం
- ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు నడుచుకుంటనైనా సభకు వొస్తరు
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 30 : ‘‘ఖమ్మం సభతో బీఆర్ఎస్ పాలనకు సమాధి కడతాం. మా సీనన్న మూడో కన్నులాంటివాడు..శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో…బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆరెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. రేపు జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ సభ ఏర్పాట్ల పరిశీలన కోసం శుక్రవారం ఖమ్మం వొచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని అడ్డుగోడలు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని పడగొట్టి ఖమ్మం సభకు హాజరవుతారని అన్నారు. పార్టీలో పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపిస్తే…రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మాది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇస్తాం. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గత నాలుగైదు నెలలుగా చర్చలు జరిపామన్నారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు రేవంత్. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే మేంమంతా ఇక్కడకు వొచ్చాం..ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు. టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు.
ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా మీ అయ్య టీడీపీని వీడింది అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి చురకులు అంటించారు. ‘‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సాయంగా ఉండేందుకు 1500 బస్సులు సభ కోసం తీసుకోవాలనుకున్నారు. కానీ ఒంటికన్ను శివరాసన్ బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. సభకు డబ్బులు కట్టి బస్సులు అడిగితే ఇవ్వట్లేదు. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా…ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వొస్తారు..మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు…. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు.సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా..బీఆరెస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు.కావాలంటే లెక్క కట్టుకో’’ అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఇంటలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి కేసీఆర్ కు పెట్టాలని చెప్పారు. జూలై 2న ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుందన్నారు.
పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు. భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్లు నడిచారని అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సచివాలయానికి రాని కేసీఆర్‌ను ప్రజల బాట పట్టించామన్నారు. ఎలక్షన్ శాంపిల్ కోసమే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తుండు…అసలు ఈ ప్రభుత్వమే శాంపిల్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ గవర్నమెంటే శాంపిల్ గవర్నమెంట్ అని.. కేసీఆర్‌ది ఆరంభ శూరత్వమన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటదన్నారు రేవంత్. అధికారంలోకి రాగానే నూటికి నూరుపాళ్లు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.



