హైదరాబాద్, జూలై 10 : రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ దిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటనకై న్యూ దిల్లీ వెళ్లిన సిఎస్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అనుమతులను జారీ చేయాలని సిఎస్ కోరారు. ప్రధానంగా, ప్యారడైస్ జంక్షన్ నుండి కండ్ల కోయా ఓఆర్ఆర్ వరకు, ప్యారడైజ్ నుండి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి, అదే విధంగా మెహదీపట్నం జంక్షన్లో ప్రతిపాదిత స్కై-వాక్ నిర్మాణ పనులకు అవసరమైన మొత్తం 150.39 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలని సిఎస్ శాంతి కుమారి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ ను కోరారు.
రక్షణ శాఖ భూములకు సరిపడా ప్రత్యామ్నాయ భూములను కూడా అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిఎస్ శాంతి కుమారి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి స్పందిస్తూ, ఈ విషయంలో సంబంధిత వివరాలను తెప్పించుకొని త్వరలోనే తగు నిర్ణయం తీసుకోగలమని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సిఎస్ శాంతి కుమారి తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్లు పాల్గొన్నారు. అనంతరం, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిశారు. జాతీయ వన్య ప్రాణి సంరక్షణ బోర్డులో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలుపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, పీఎంజీఎస్‌వై పనులకు సంబంధించి త్వరిత గతిన అటవీ శాఖ అనుమతులు ఇవ్వడానికి నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని సిఎస్ కోరారు. అదే విధంగా, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో కూడా సిఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిఎస్ విజ్ఞప్తి చేశారు.




