- రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో
- అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు
- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 5 : దుబాయ్‌లో మంత్రి కేటీ రామారావు పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది.
తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్కో తెలిపింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్ట్రక్షన్(నాక్)తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో మంత్రి కేటీఆర్‌కి తెలియజేశారు.




