పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ముఖ్యమంత్రి కేసీఆర్ నీలం మధు కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి.ఇంటికో ఇంచార్జిగా ఉండి గెలిపించుకుంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు, యువత కోరుతున్నారు. కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీ వర్గాలకు తగిన స్థానం కల్పించకపోవడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకుండా కేసీఆర్ నిర్లక్ష్యం చెయ్యడం పై బీసీ వర్గాలు గొంతెత్తుతున్నారు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో అనునిత్యం ప్రజాసేవ చెయ్యడంతో పాటు బీఅర్ఎస్ పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డ నీలం మధు ముదిరాజ్ కు టికెట్ విస్మరించడం సరికాదని రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తికి బీఅర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా ఒక పటాన్ చెరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని తేల్చి చెప్తున్నారు.సబ్బండ వర్గాల ప్రజల ప్రతినిధిగా నీలం మధు అసెంబ్లీకి వెళ్తే బడుగు బలహీన వర్గాల ప్రజలకు తప్పక న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంటికొక్కరు లాగా ముందుకు వచ్చి బహుజన వాదాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి నీలం మధు ముదిరాజ్ ను గెలిపిస్తామని ధీమాగా ఉన్నారు.నీలం మధు కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు, సబ్బండ వర్గాల ప్రజలు రోజు వారిగా నీలం మధు ను కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. అంతకు రెట్టింపు స్థాయిలో ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.ఎన్నికల ప్రచారానికి తామంతా వచ్చి వెన్నుదన్నుగా నిలబడి ఇంటి ఇంటికి ప్రచారం చేసి గెలిపిస్తాం అంటున్నారు. పార్టీల అభ్యర్థులకు గల్లీ కొక ఇన్చార్జి ఉంటే ఇంటికి ఒక ఇన్చార్జిగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తామని లక్షలాది యువత నీలం మధు ముదిరాజ్ కు భరోసా ఇస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి సబ్బండ వర్గాల నుంచి వస్తున్న మద్దతుకు అనుగుణంగా నీలం మధు ముదిరాజ్ తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన సన్నిహితులు,అభిమానుల ద్వారా క్షేత్రస్థాయిలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు .



