- రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దక్షిణ ఒడిస్సా-ఉత్తర ఆంధప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఇది 26న వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
రానున్న మూడురోజులు (జులై 25,26,27) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రోజున హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో జల కళ కనిపిస్తుంది. జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాకు భారీగా నీరు చేరుతుంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. హిమాయత్ సాగర్‌కు 1600 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్‌కు 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1785.65 అడుగులకు చేరింది. వరద పెరగడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు.
అయినా ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గకపోవడంతో.. సోమవారం మరో రెండు గేట్లను ఎత్తాలని జలమండలి నిర్ణయించింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి (1763.50 అడుగులు) చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో ప్రధాన నదులతో పాటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.




