- రాధ మిస్సింగ్ కేసులోనూ ఆరా
- హైదరాబాద్‌లో ఆడ్వకేట్ శిల్ప ఇంట్లోనూ సోదాలు
- చేగుంటలో మావో అగ్రనేత కుమారుడి ఇంట్లో తనిఖీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడిచేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా పర్వతాపూర్‌లోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థిని రాధ రెండేండ్ల క్రితం ఏపీలోని విశాఖలో తప్పిపోయింది.
దీంతో ఆమె తల్లి విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు (సీఎంఎస్) తన కూతురిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని అందులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, అడ్వకేట్ శిల్ప తమ ఇంటికి వొచ్చేవారని, వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లిందని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ కేసు రిజిస్టర్ చేసింది. దీంతో శిల్ప, దేవేంద్రతోపాటు కిరణ్ ఇండ్లలో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మెదక్ జిల్లాలోని చేగుంటలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో సోదా చేసారు.
పలు కేసులకు సంబంధించి ఆధారాల కోసం గురువారం తెల్లవారుజాము నుంచే తనిఖీ చేస్తున్నారు. ఉప్పల్‌లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఉంట్లో అధికారులు తనిఖీలు జరిపారు. అనంతరం శిల్పను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మాదాపూర్‌లోని కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్ కేసుకు సంబంధించి శిల్పను విచారించనున్నారు. గతంలో ఎల్బీనగర్, ములుగు, గద్వాల, చెర్ల, ఏపీలో నమోదైన కేసుల్లో శిల్పను అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో న్యాయవాది దేవేంద్ర నివాసంలోనూ సోదాలు చేసిన అధికారులు.. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో చైత్యన్య మహిళా సంఘంలో దేవేంద్ర పనిచేశారు. గతంలో ఏవోబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన ప్రభాకర్ భార్యే దేవేంద్ర. అదే విధంగా.. చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడు శంకర్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.ఎన్ఐఏ సోదాలపై అడ్వకేట్ శిల్ప భర్త బండి కిరణ్ స్పందించారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాధ కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శిల్పను ఇబ్బందిపెట్టాలని కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారని బండి కిరణ్ తెలిపారు. సోదాల విషయంపై ఎన్ఐఏ మాకు నోటీసులు ఇవ్వలేదు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారని శిల్ప బయటికొచ్చింది. శిల్పను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. గతంలో అర్బన్ మావోయిస్టు అని శిల్పను 6నెలలు జైల్లో ఉంచారు. రాధ కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదని భర్త బండి కిరణ్ అన్నారు.




