పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు
మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు
రాయబరేలీ వాసులకు సోనియా గాంధీ లేఖ
రాయబరేలీ, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన నియోజక వర్గమైన రాయబరేలీ వాసులకు ఒక లేఖ రాశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా..ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరించిన రాయబరేలీ వాసులను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు. రాయ్‌బరేలీతో మా కుటుంబానికి ఉన్న బంధాన్ని మాటల్లో చెప్పలేను. దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన తొలినాళ్లలో మీరు మా మామగారైన ఫిరోజ్ గాంధీని మీ ప్రతినిధిగా లోక్‌సభకు పంపారు. ఆ తర్వాత మా అత్తయ్య ఇందిరా గాంధీనీ మీరు మీ ప్రతినిధిగా ఎన్నుకున్నా రు.
ఊహించని పరిస్థితిలో నా అత్తగారిని, నా జీవిత భాగస్వామిని కోల్పోయిన తరువాత నేను రాయబరేలీ రావాల్సి వొచ్చింది. ఆ కష్టకాలంలో మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు. నన్ను రెండు సార్లు మీ ప్రతినిధిగా ఎంచుకుని లోక్‌సభకు పంపారు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి రాయబరేలీ వాసులైన మీరే కారణం. ఈ కాలంలో నేను నా వంతుగా మీరు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాను. పెరుగుతున్న నా వయసు, ప్రస్తుత నా ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నాను. ఈ విషయం నాకు బాధ కలిగించినా.. నా మనసు మీతోనే ఉంటుంది. ఇప్పటి వరకు అనేక విధాలుగా మా కుటుంబానికి అండగా నిలిచిన మీరంతా రాబోయే రోజుల్లోనూ ఇదే రీతిన మాకు అండగా నిలుస్తారని నాకు తెలుసు. త్వరలోనే వొచ్చి మిమ్మల్ని తప్పక కలుస్తాను’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నుంచి వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ చేయనున్న స్థానంగా రాయబరేలీ నిలవనుంది. ఆది నుంచి గాంధీ కుటుంబానికి పట్టున్న ఈ స్థానం నుంచే ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా నడిచినా, యూపీలో అది మరింత ప్రబలంగా కనిపించినా..రాయబరేలీలో మాత్రం సోనియా గెలిచి సత్తా చాటారు. ఎంపీగా సోనియా గాంధీ రాయబరేలీని పారిశ్రామికంగా పరుగులెత్తించారు.
కపుర్తల, పెరంబూర్‌లలో ఉన్న రైలు పెట్టెల తయారీ కర్మాగారాలకు అదనంగా… మూడవ అధునాతన కర్మాగారాన్ని రాయ్‌బరేలీలో నిర్మింపజేశారు. ఇదిగాక.. ఎన్టీపీసీ, ఎయిమ్స్, నిఫ్ట్, నైపర్, బిర్లా సిమెంట్స్, రాయ్‌బరేలీ టెక్స్టైల్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లు వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలను ఏర్పాటు చేయడంతో ఆమెను రాయబరేలీ వాసులు గుండెల్లో పెట్టుకుంటూ వొచ్చారు. 1952లో ఫిరోజ్‌గాంధీ, 1967, 1971లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1977లో ఇందిరా గాంధీ..రాజ్ నారాయణ్ యాదవ్ చేతిలో పరాజయం పాలైనా 1991 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ సీటును నిలబెట్టుకుంటూ వొచ్చారు. ఈ స్థానంలో 1996, 1998 ఎన్నికల్లో మాత్రమే ఈ స్థానంలో భాజపా గెలిచింది. 2004 నుంచి నేటి వరకు సోనియా గాంధీ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూనే వొచ్చారు.





