రామప్పలో రాష్ట్రపతి…

  • మొదటిసారి సందర్శించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము
  • ప్రసాద్‌ ‌పథకం, కామేశ్వరాలయ పునరుద్ధరణ శిలాఫలకాల ప్రారంభం

వెంకటాపూర్‌(‌ములుగు), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. కాకతీయుల పాలనలో క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన రామప్ప దేవాలయాన్ని దేశ ప్రథమ పౌరులు సందర్శించడం ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రత నడుమ మధ్యాహ్నం రామప్పలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ‌ప్రాంతంలో హెలికాప్టర్‌లో దిగారు. అక్కడ నుంచి రామప్ప దేవాలయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారి వెంట ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారులు హరీష్‌ ‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్రపతి ముర్ము రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారెను ఆదివాసి పూజారులు రాష్ట్రపతి, గవర్నర్లకు అందించారు. ఆలయ నిర్మాణం, విశిష్టతలను యునెస్కో గుర్తింపు కోసం తయారు చేసిన వివరాలను, వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌బాడీ విధించిన నిబంధనలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ‌ట్రస్ట్ ‌కన్వీనర్‌ ‌పాండురంగారావు వివరించారు. ఆలయ ప్రాంగణంలో శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం ఆలయ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభా వేదికలో జాతీయ గీతాలపన అనంతరం రిమోట్‌ ‌ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం రూ. 62 కోట్ల నిధులతో ప్రసాద్‌ ‌పథకాన్ని, రామప్పను ఆనుకుని ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్ల నిధులతో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ప్రారంభించారు.

గిరిజన సాంప్రదాయం ప్రకారం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అధికారులు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్‌, ‌కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  శ్రీమతి సత్యవతి రాథోడ్‌, ‌పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క), ములుగు జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్‌, ‌ములుగు ఎస్పీ సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌జి పాటిల్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *