రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు..
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా..
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు
బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో
కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర  హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం  సికింద్రాబాద్‌లోని ఇంపీరి యల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ…సోషల్‌ మీడియా ద్వారా ప్రతీ ఇంటికీ బీజేపీ కార్యక్రమాలు, విజయాలను తీసుకెళ్లాలని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. దేశంలో మోదీ.. మోదీ అని యువత నినదిస్తుందని, మళ్లీ మోదీనే ప్రధానిని చేస్తామని మహిళలంతా అంటున్నారని అమిత్‌షా చెప్పారు.
వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కు 400 సీట్లు దాటతాయని,  అందులో తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో దిల్లీలో మళ్లీ అధికారంలోకి వొస్తామ ని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత భారత్‌ నిర్మాణమే లక్ష్యంగా, మోదీజీ గత పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారని కొనియడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కానీ, ప్రధాని మోదీపై ఎలాంటి అవినీతి మరక లేదన్నారు. మోదీ  మరోసారి ప్రధానిగా వొస్తే, భారత్‌ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని తెలిపారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్ల పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించిందని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక్కటేనని, ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలేని విమర్శించారు. మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంఐఎం చేతిలో ఆ రెండు పార్టీలు కీలుబొమ్మలని విమర్శించారు. కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదన్నారు. వారి కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడుతారని విమర్శించారు. త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అవినీతి జాబితా పంపిస్తానని, ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీపై విమర్శలు చేయాలని అమిత్‌ షా ఈ సందర్భంగా సవాల్‌ విసిరారు. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని, పది రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి ముష్కరులను మట్టుబెట్టామని తెలిపారు. భారత సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్‌ ప్రభుత్వం కాదని హోమ్‌ మంత్రి అమిత్‌ షా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *