- తనిఖీలు తప్పవన్న ట్రాఫిక్ పోలీసులు
- న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : కొత్త సంవత్సర వేడుకలపై ఈ యేడు కూడా ఆంక్షలు తప్పడం లేదు. కరోనా దెబ్బతో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో బహిరంగంగా పార్టీలకు అవకాశం లేదు. కరోనా జాగ్రత్తలు, ఆంక్షల మధ్య నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగరవ్యాప్తంగా వంద బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ 5 గంటల వరకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలు జప్తు చేయడంతో పాటు వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కేసులకు సంబంధించిన వివరాలు పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డుకు అనుసంధాని స్తామని.. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ దక్కింది. రేపు డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి. ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉండనున్నాయి. న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు.
త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. న్యూఇయర్ వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని నిబంధన విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని ఆదేశించింది. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని సూచించింది.




