స్వావలంబన దిశగా భారత్- ద్రవ్యోల్బణం తగ్గుముఖం
– ఉగ్రవాదంపై పోరుకు చిహ్నం ఆపరేషన్ సిందూర్- అభివృద్ధి పథంలో కశ్మీర్
-స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము
న్యూదిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్14: స్వావలంబన దేశంగా అవతరించే దిశగా భారత్ దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఎగుమతులు పెరిగాయని, అన్ని కీలక సూచీలు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. అలాగే దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. రాష్ట్రపతి ముర్ము ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటానికి ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పహల్గాం దాడికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక, దృఢమైన ప్రతిస్పందన ఇదని, దీనితో మన సాయుధ దళాలు దేశాన్ని రక్షించడానికి ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందన్నారు. పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని అమానుషమైన, పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ’ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండించింది. మనల్ని విభజించాలనుకునే వారికి దీటైన జవాబు ఇచ్చింది. ’ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రమూకలకు గుణపాఠం నేర్పింది. దేశాన్ని కాపాడే విషయంలో మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. రక్షణ రంగంలో ’ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం విజయానికి నిదర్శనంగా నిలిచింది. సుపరిపాలన, అవినీతిని సహించని విధానాలతో భవిష్యత్తు వైపు దేశం పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కశ్మీర్ లోయలో రైలు మార్గంతో స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా స్వీకరించారని, మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నింటికంటే ముఖ్యమైనవి అన్నారు.ఆగస్టు 15 దేశ ప్రజల సమిష్టి జ్ఞాపకాలలో నిలిచిపోయే చారిత్రాత్మక తేదీ అని ఆమె పేర్కొన్నారు. సుదీర్ఘ వలస పాలనలో భారతీయులు తరతరాలుగా స్వేచ్ఛ గురించి కలలు కన్నారని అన్నారు. దేశంలోని ప్రతి మూల నుంచి ప్రజలందరూ విదేశీ పాలన సంకెళ్లను తెంచుకోవాలని శాంతియుత మార్గంలో పోరాడారని తెలిపారు. వారి పోరాటం అచంచల మైన ఆశావాదంతో నిండి ఉంది. ఇది స్వాతంత్య్ర తర్వాత కూడా మన అభివృద్ధిని నడిపించిందని అన్నారు. రేపు మనం త్రివర్ణ పతాకానికి వందనం చేస్తున్నప్పుడు 78 సంవత్సరాల క్రితం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్ర తెచ్చిన త్యాగధనులందరికీ కూడా నివాళులు అర్పిస్తామని అన్నారు. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం.. ఒక తరాన్ని గొప్ప కలలు కనేలా ప్రేరేపించింది. అదేవిధంగా దేశ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్’కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటు-ంది. మరోవైపు నూతన ఆత్మవిశ్వాసంతో మన యువత క్రీడల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా చదరంగంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ’జాతీయ విద్యా విధానం- 2020’ విస్తృత మార్పులు తీసుకొచ్చింది. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు కూడా కనుమరుగవుతున్నాయి. సామాజిక సంక్షేమంతో కూడిన సమగ్ర ఆర్థిక వృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్‌ను ముందుకు నడుపుతోందని తెలిపారు. స్వాతంత్య ్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగం ఆలోచనాత్మకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారని ప్రధాని ’ఎక్స్’లో పేర్కొన్నారు.



