హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొత్తలోగోలో చార్మినార్ తొలగించడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు ఆందోళనకు దిగారు. పార్టీ శ్రేణులతో కలసి చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నాయకులతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా ప్రభుత్వం మూర?పు నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాజకీయ కక్షతోనే మార్పు చేస్తుందని కెటిఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమేనని, అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని, అయితే చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం మూర?పు నిర్ణయమే కాగలదని విమర్శించారు. హైదరాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనలేదని, అందుకే కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని ఆయన చూస్తున్నారని, లోగో మార్పుపై భారాస తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర?పు నిర్ణయాలను అంగీకరించేది లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తున్నదని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా రాజముద్రను మారుస్తున్నదని చెప్పారు.హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని సూచించారు.
రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. లోగోలో చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనన్నారు. అధికారిక చిహ్నంలో మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. అమర వీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోష పడరని చెప్పారు. సోనియా గాంధీ బలి దేవత అని చెప్పిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున ఎన్ని కార్యక్రమాలు పెట్టినా మర్చిపోలేని విషయం ఏంటంటే వేలాది మంది మృతులకి కారణమైన ఆ పార్టీని ప్రజలు క్షమించరని స్పష్టంచేశారు.





