లంచం…అదో రోగం
సమాజానికి పట్టిన గ్రహచారం.
ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే.
ఆకలితో దేబురిస్తూ
కంచం నిండితే చాలని
ఆరాటపడే జనులు కొందరైతే,
లంచాలతో
కడుపునింపుకోవాలని చూసేవారు
మరికొందరు.

సమకాలీన రాజకీయం
తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో
మకిలిపట్టిపోతోంది.
డబ్బుపై వ్యామోహంతో
గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే
మనస్తత్వం పుణికిపుచ్చుకొని
ఏ ఎండకాగొడుగు పడుతూ
పబ్బంగడిపే మేకవన్నె పులుల
నిజస్వరూపం గ్రహించలేక,
స్వప్రయోజనాలు తప్ప
ఏ జెండా అవసరంలేని
ప్రబుద్దులని  తెలుసుకోలేక,
జనం నమ్మి ఓటేస్తే
అమ్ముడుపోయే బుద్ధి
విశ్వాసఘాతకులది,
గెలిచినోడ్ని కొనేసే కక్కుర్తి
పార్టీలది.

ఈ రాజకీయ తతంగమంతా కని,
దేశమంతా నిండిన
రాజకీయ ఊసరవెల్లుల్ని చూసి,
ఊసరవెల్లి ఉరేసుకుంటానంటే
తప్పేమీ లేదుగా!

లంచంగడ్డితో
మకిలిపట్టిపోతోన్న
రాజకీయాన్ని,
గడ్డి తినే నాయకాది గణాన్ని కని
తమకి గడ్డుకాలం దాపురించిందని
గడ్డి బెంబేలెత్తడం సమంజసమేగా!

ఘనత వహించిన
నేటి రాజకీయమా
నీకు నీవే సాటి,
అన్యులెవరూ లేరు నీకు పోటీ…

 –  వేమూరి శ్రీనివాస్‌
9912128967
తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *