రచయితల పండగ

ఛాయా సాహిత్య సంబరం పుస్తకాల వేడుక. రచయితల పండగ. తొలిసారిగా ఈ ప్రయోగానికి నాంది పలుకుతున్నందుకు ఛాయా మిత్రబృందానికి థాంక్స్. గతకొన్నేళ్లుగా ఛాయ ప్రచురణలు ఒక మైలురాయిగా, మేలుమలుపుగా ఇప్పటికే గుర్తించాం. ఛాయ కూడా తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా, తెలుగుపలికే ప్రతిచోటా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే వుంది. తెలుగుభాషని “తెలుగు”కే పరిమితం చేయలేమని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఇరుగుపొరుగు భాషల్ని కలుపుకొచ్చే కృషికి పునాది వేస్తోంది ఈ సాహిత్య సంబరం. నా మటుకు నాకు బాగా నచ్చింది- ఇంతవరకూ మనం మన ప్రధాన స్రవంతిలో కాసింత చోటు కూడా ఇవ్వలేకపోయిన దఖనీని ఛాయ పట్టించుకోవడమే కాకుండా, దఖనీ సాహిత్యజీవుల్ని వేదికమీదికి తీసుకురావడం! తెలుగు భాషాసాహిత్యాల ఉనికి కేవలం తెలుగుతోనే ముడిపడిలేదన్నది చరిత్ర నేర్పిన పాఠమే. కానీ, దానికొక వర్తమానత్వాన్ని తీసుకురావడం ఇప్పుడు చాలా అవసరం. ఎల్లలు దాటి వెళ్లిపోతున్న తెలుగు సాహిత్యాన్ని గురించి- ముఖ్యంగా అమెరికా, లండన్, గల్ఫ్, మలేషియా, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా- లాంటి దేశాల తెలుగు రచయితలకి ఎలాంటి అవకాశం ఇవ్వగలమో ఆలోచించాలి. ప్రవాస తెలుగుసాహిత్యాన్ని ప్రధానమైన పాయగా గుర్తించి మాట్లాడుకునే వాతావరణం కూడా తెలుగురాష్ట్రాల్లో ఏర్పడాలి.

అఫ్సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *