- నిత్యజీవితంలో యోగా భాగం కావాలి
- ప్రజలకు మంత్రి హరీష్ రావు పిలుపు
- కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్‌కు నీరు విడుదల చేసిన మంత్రి
- వర్షాలు ఆలస్యం కావడంతో చర్యలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 21 : ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడంతో ఆరోగ్య తెలంగాణ కాదని చెప్పారు. ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజూ ఒక్క గంట సమయం కేటాయించి యోగ, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని సూచించారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ…నిత్య జీవితంలో యోగా భాగమైందని, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరూ యోగ అలవర్చుకోవాలన్నారు. కొంతమంది రోగాల బారినపడిన తర్వాత ఆరోగ్యం కోసం చేసేది యోగా అని అపోహలో ఉన్నారని చెప్పారు. యోగా అనేది రోజూ సాధన చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా దీర్ఘాయుష్షు లభిస్తుందని మంత్రి హరీష్ అన్నారు.
కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని, ఆధునిక ప్రపంచం ఆహార అలవాట్లు కూడా మనుషులను రోగాలపాలు చేస్తున్నాయని తెలిపారు. అన్నింటికీ పరిష్కారం యోగా ఒక్కటేనని వెల్లడించారు. అనవసర విషయాలు సెల్ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంటుంది కానీ.. యోగా చేయడానికి ఉండటం లేదన్నారు. చిన్న వయసులోనే ప్రజలు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యోగా అనేది ఒక్క శరీరానికే కాదు మనసుకు కూడా ఆరోగ్యం ఇస్తుంది. ప్రపంచ దేశాలు మన భారతదేశం నుంచి యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని పొందుతున్నారని చెప్పారు. అన్ని దవాఖానల్లో గర్భిణీలకు, వారికి అనువైన యోగాసనాలు నేర్పిస్తున్నామని, దాని ద్వారా ఆరోగ్యమైన సుఖప్రసవం అవ్వడానికి అవకాశాలున్నాయని అన్నారు.
గ్రీన్ కవర్ పెంపకంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇక వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగయనాక సాగర్‌లోకి 2టీఎంసీల గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు. దీంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు వెళ్లనున్నాయి. దీతో కాలువల ద్వారా పంటలకు విడుదల చేస్తారు. మరోవైపు వానాకాలం పంటల కోసం కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని బుధవారం ఉదయం విడుదల చేసారు.




