యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర. డిసెంబర్30 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముందుగా ప్రధాన ఆలయంలో ధ్వజ స్తంభానికి మొక్కి అనంతరం గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మంటపంలో రాష్ట్రపతి, రాష్ట్రపతి కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి జ్ఞాపికను అందచేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉదయం 9.50. నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతిలో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంట రాగా, యాదాద్రి కొండ క్రింద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిపాడ్ లో రాష్ట్రపతికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, డిసిపి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ఎం.వి.భూపాల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి చేరుకున్న రాష్ట్రపతి
ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్, తదితరులు
ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి చేరుకున్న రాష్ట్రపతి
ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్, తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిముగిసింది. హకీంపేట విమానాశ్రయం నుంచి ఆమె తిరిగి దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఆమె బిజీగా గడిపారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. డిసెంబర్ 27న నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు.
డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. గురువారం నారాయణమ్మ కాలేజ్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్‌లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. 3గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.




