యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన..!

‘‘75 ‌సంవత్సరాల అమృత మహోత్సవంలో ఒక ప్రజాస్వామ్య పాలనలో సకల అవలక్షణాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసి కాస్తా మనసున్నవారు, నిజాయితీకి విలువనిచ్చేవారు కన్నీళ్లు పెట్టడం నిజం. అందులో మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. నోరెత్తితే తప్పుడు కేసులు, వేధింపులతో అప్పుడెప్పుడో  చుసిన హిట్లర్‌, ‌ముస్సోలినీని మరి పిస్తున్నారు. ఈ అరాచక, ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఏంటి?’’

నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన పెంచటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 10‌న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కాని అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించివేస్తోంది. పరువు హత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు మనం అనునిత్యం వింటూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. మన దేశంలో కూడా దళితులు, మైనారిటీలు, మహిళలు, ఇంకా బలహీన వర్గాలు అభివృద్ధి ఫలాల నుండి నెట్టివేయబడుతున్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక విధానల వల్ల అనేక దేశాల్లో ఈ అసమానతలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి.
అంతర్జాతీయ ఒడంబడికలు హామీ ఇస్తున్న వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, పరువు, మర్యాదలకు సంబంధించిన హక్కులుగా పరిగణించినది. 1948లో మానవ హక్కుల ప్రకటనను అంకురార్పణ జరిగింది.1950 జనవరి 26న డా. బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌ప్రజాతంత్ర భావాలు, భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. అంతర్జాతీయంగా పౌరహక్కుల కోసం సాగిన పోరాటాల ఫలితంగా మన రాజ్యాంగంలో పౌర ప్రాథమిక హక్కులకు గ్యారంటీ లభించింది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ మానవ హక్కులు కల్పిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. మన దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడానికి 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పడింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్‌ ‌లు ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా, మానవ హక్కులకు భరోసా కల్పించడంలో మన దేశంలో పెద్దగా సాధించినదేమీ లేకపోగా, ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది. ఈ కమిషన్‌ ‌చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాని రాజ్యాంగబద్ధమైన సంస్థ కానందున, ఆ తర్వాత 2006 సంవత్సరంలో మానవ హక్కుల చట్టాన్ని సవరించి కొన్ని మార్పులు చేసిన, మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు క్రూరమైన దుష్కృత్యాలకు తగ్గలేదు.ఇవి మానవాళి అంతరాత్మకు గాయం చేశాయనేది నిర్వివాదాంశం.
పాలనలో పారదర్శకత, సమాన హక్కులూ, సమాన అవకాశాలూ, సమాన భాగస్వామ్యం, మనుషులందరికీ గౌరవప్రదమైన జీవితం, వివక్షకు తావు లేని మానవ సంబంధాలు అన్నీ కలిస్తే ప్రజాస్వామ్యం. ఆ పేరు ఎత్తగానే మనకు గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్‌, ‌ప్లేటో ఆనాటి పాలనా వ్యవస్థలు గుర్తొస్తాయి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొని తగిన శిక్షలు వేసి అమలు పరచవలసిన బాధ్యత భారత ప్రభుత్వం వ్యవస్థల పని అయితే ఆ వ్యవస్థలోని అధికారులే ఉల్లంఘనకు నేరాలకు పాల్పడినప్పుడు ఆ నిజాలను బయటపెట్టి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేయడం బాధితులకు అవసరమైన మద్దతు ఇవ్వడం. హక్కుల స్పృహ లేక  ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులన్నీ భారత ప్రజల ప్రజాస్వామిక పోరాటాల చరిత్రను రకరకాల పేర్లతో వక్రమార్గం పట్టించారు. భారతదేశ చరిత్రను ప్రజల దృక్కోణం నుంచి విశ్లేషించిన వాళ్లు సైతం, కొద్దిగా అటూ ఇటూగా హిందూత్వ ఆధిపత్య శక్తుల ఆలోచనల మూసలోనే ప్రయాణాన్ని కొనసాగించినట్టు చరిత్ర చెపుతోంది. ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పటం మీద అనేక సోషలిస్టు ప్రజాస్వామ్య దేశాల ఆవిష్కరణ జరిగింది. అయినా వివిధ దేశాల లోపల బయట కూడా మానవ హక్కుల ‘హననం’ జరుగుతూనే ఉంది. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. మానవ హక్కుల కమిషన్‌ ‌లు ఉన్నాయని పౌరులు ప్రతి విషయానికి ఇతరులను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి కమిషన్లను ఆశ్రయించకూడదు. ఆ సోయిని కలిగించే కృషిలో మేధావులు ఉన్నప్పుడే ఒకింత గర్వాన్ని కలిగిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్‌ ‌లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది. స్వతంత్రంగా పని చేయాల్సిన రాజ్యంగ సంస్థలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, తాము చేసిన రాజ్యాంగానికి తామే తూట్లు పొడిచే పాలకులు అధికార పీఠాలను ఆక్రమించారు. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు కాలంలో అధికారపక్షం సభ్యులే ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. మంత్రులే అసమ్మతి వ్యక్తం చేసేవారు.  వారంతా అరమరికలు లేకుండా పార్లమెంటులో సుదీర్ఘ చర్చలు జరిపేవారు.  కానీ నేడు అర్ధవంతమైన చర్చల పట్ల ఎవరు ఆసక్తి చూపడం లేదు. హక్కుల ఉల్లంఘనకు ఇక్కడనే బీజం పడుతున్నది.  మానవ హక్కులకు విలువ లేని దేశం ప్రజాస్వామ్య హోదాకు అర్థం కాదు. నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ ‌లా) తో రక్షించాలి.
కానీ, మోడీ ప్రభుత్వం మానవ హక్కుల రక్షణ కంటే వాటి రాజకీయ ప్రభావం పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతుందనే విమర్శ ఉంది. భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష.
75 సంవత్సరాల అమృత మహోత్సవంలో ఒక ప్రజాస్వామ్య పాలనలో సకల అవలక్షణాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసి కాస్తా మనసున్నవారు, నిజాయితీకి విలువనిచ్చేవారు కన్నీళ్లు పెట్టడం నిజం. అందులో మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. నోరెత్తితే తప్పుడు కేసులు, వేధింపులతో అప్పుడెప్పుడో  చుసిన హిట్లర్‌, ‌ముస్సోలినీని మరి పిస్తున్నారు. ఈ అరాచక, ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఏంటి? చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొని తగిన శిక్షలు వేసి, అమలు పరచవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, అధికార వ్యవస్థ చట్ట ఉల్లంఘనని, నేరాలని  బయటపెడుతూ పౌర హక్కుల సంఘాలు బాధితుల పక్షం వహిస్తున్నందుకు వాటి మీద దాడి చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్‌ ‌స్టేషన్లలో జరుగుతున్నాయని నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.‌వి రమణ వ్యాఖ్యాలు పెద్ద దుమారం లేచింది. ప్రజలకు రాజ్యాంగ పరమైన రక్షణ ఉన్న వేధింపులు కొనసాగుతున్నాయని, మానవ హక్కులకు సమగ్రతకు అత్యధిక ముప్పు వాటిల్లడం విచారకరమని అభిప్రాయపడ్డారు. కస్టోడియల్‌ ‌టార్చర్‌ ‌సహా, ఇతర వేధింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది.
image.png
డా।। సంగని మల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌,9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *