మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ఉపాధి కల్పిస్తానని డిక్కీ సంస్థ పేరుతో దళితులను లక్ష్యంగా చేసుకుని ఎస్.బి.ఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్టపాగ శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు శ్రీరాం సత్యనారాయణ, కందుల రాములు, చంద్రశేఖర్, నవీన్, చేతక్, ఎర్ర వెంకటేష్, లత, రమాదేవి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీనివాస్ 2019లో ఎస్బిఐ బ్యాంక్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తానని సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేస్తానని తమకు మోసపూరితమైన మాటలు చెప్పి తమ ప్రమేయం లేకుండా తమ పేరుపై బ్యాంకుల నుండి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల వరకు లోన్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. తమకు బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి మీరు లోన్లు తీసుకున్నారని చెప్పేదాకా తమకు తెలియదని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే విషయంపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ తక్షణమే స్పందించి న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *