మేళ్ల చెరువు సంరక్షించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: డ్రైనేజీ, మురుగు నీటి నుండి మేళ్ల చెరువును సంరక్షించాలని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేళ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏలియన్స్ సంస్థ, నీవి బిల్డర్స్ వారు డ్రైనేజీ నీటిని మేళ్ల చెరువులోకి పైప్ లైన్ల ద్వారా వదులుతున్నారని ఆరోపించారు. డ్రైనేజీ నీటితో చెరువు మొత్తం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేళ్ల చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. చెరువులోని నీటిని పశువులు తాగి అనారోగ్యాలకు గురవుతున్నాయని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మేళ్ల చెరువును కాపాడాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మేళ్ల చెరువును సంరక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే నరసింహ, సుధాకర్ రెడ్డి, నాయికోటి కృష్ణ, వాజిద్, కొల్లూరు శ్రీను, నవారి శ్రీనివాస్ రెడ్డి, నవారి సాయినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *