మెగా అవెన్యూ ప్లాంటేషన్ లో భారీగా మొక్కలు నాటాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: ఈనెల 26న నిర్వహించనున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సామూహిక హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని మున్సిపల్ మరియు గ్రామీణ ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటేందుకు ఎంపిక చేసిన స్థలాలలో తీసిన గుంతలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శనివారం రోజున మున్సిపల్ పరిధిలో కేటాయించిన లక్ష్యం మేరకు ఐదు వేల మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలన్నారు.  అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇచ్చి పెద్ద సైజు గల నాణ్యమైన మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.  ప్రతి మొక్కకు ఆధారంగా కర్రను పెట్టాలని అన్నారు.  ఇంకా రెండు రోజులే సమయం మిగిలి ఉన్నందున గుంతలు తవ్వే పనులన్నీ పద్ధతి ప్రకారంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. పరిగి మండల పరిధిలోని సాలె పూలబాటతండాలోని 10 ఎకరాల అటవీ భూమిలో లక్ష్యం మేరకు  30 వేల మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే పనులను ఎంపీపీ అరవింద రావుతో కలిసి పరిశీలించారు.  జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షణీయంగా పెద్ద సైజు మొక్కలు నాటాలని అన్నారు.  గత తొమ్మిది సంవత్సరాలుగా హరితహారంలో మొక్కలు నాటినప్పటికిని అవెన్యూ ప్లాంటేషన్ క్రింద హైవేకు ఇరువైపులా చెట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   పూడూరు నుండి పరిగికి వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా గుంతలు తవ్వే పనులను కలెక్టర్ పరిశీలించారు.  ఈనెల 26న  నిర్వహించనున్న సామూహిక హరితోత్సవంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.  రెండు నుండి మూడు వరసలలో గుంతలు తవ్వి పద్ధతి ప్రకారంగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.  రోడ్డుకు ఇరువైపులా మొలిచిన గడ్డిని గ్రాస్ కట్టర్ తో తొలగించాలని, వరుస క్రమంలో గ్యాప్ లేకుండా నాణ్యమైన పెద్ద సైజు మొక్కలను జాతీయ రహదారికి ఇరువైపులా నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  పరిగి ఎంపీపీ అరవింద రావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పరిగి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్,  డిపిఓ తరుణ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ సుధారాణి,  పరిగి, పూడూర్ ఎంపీడీవోలు, తహసిల్దారులు, ఎంపీలు, ఏపీవోలుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *