- గోదావరిలో నీరుండగా ప్రాణహితలో ఎందుకు ప్రాజెక్ట్..
- కాళేశ్వరంపై సంబంధిత వ్యక్తులకు జస్టిస్ పిసి ఘోష్ సూటి ప్రశ్నలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : మూడు నెలల వరద నీరు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా..? అని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. జలసౌధలో కాళేశ్వరంపై పలువురు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. గోదావరిలో నీళ్లుండగా ప్రాణహిత నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది.
ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణంపై ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను తమకు అందించాలని సూచించింది. రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు హాజరైన వారి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అఫిడవిట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నివేదికలు 27న అందనున్నాయి. ఇప్పటికే ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలకు సంబంధించి ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. వొచ్చే నెల 7న ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్, సీఎస్ఎంఆర్ఎస్ నివేదికలు కమిషన్‌కు అందనున్నాయి. ప్రధానంగా ఆర్థిక అంశాలపైనే దృష్టి సారించిన కమిషన్ ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తూ..వాళ్లు ఇచ్చే వివరణను అఫిడవిట్ల రూపంలో తీసుకోనుంది





