కొండమల్లెల మోముపై
చిప్పిల్లిన రక్తమేవరిదో …
పంట చేలను కోస్తున్న
కిరాయి కత్తెవరిదో…
కనుక్కుంటారా?
అడవి పై మారణ ” హోమం ” చేస్తున్న
చేతులెవరివో…
ఆకులపై అత్యాచారం చేసిన
ముల్లులెవరివో …
కాసింత చెబుతారా?
దేశం కోసం ఘోషించే నోళ్ళన్ని
మూగబోయాయెందుకు?
మీ మౌనం మాపై దాడులకు
అర్ధాంగీకారమా?
మాకే భ్రమలు లేవిప్పుడు
ఏ ఓదార్పు గీతాలు ఆలపించకండి
అయినా…
మీ ఏలుబడిలో న్యాయాన్ని కోరడమంటే…
మేకలు తోడేళ్లను కాపలా పెట్టుకుని నిద్రపోవడమే
మేమిప్పుడు కాలిపోతున్నందుకు ఏ బాధా లేదు
మా చితిమంటల వెలుగుల్లోనైనా
మీ ముసుగులు తొలగి దేశం నిజాన్ని చూస్తున్నందుకు
-దిలీప్.వి
సెల్: 8464030808
జిల్లా ప్రధానకార్యదర్శి
ఉమ్మడి వరంగల్ జిల్లా
మానవ హక్కుల వేదిక




