మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మునుగోడు దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇది నిజంగా ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా కొంత ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఉప ఎన్నిక రావడం వల్లే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడన్న విమర్శ లేకపోలేదు. అయితే ఒక్క మునుగోడునే దత్తత తీసుకుంటాననడం కేవలం ఎన్నిక దృష్ట్యా చేసిన వాగ్దానమన్న విమర్శ లేకపోలేదు. దీంతో మునుగోడు అభివృద్దిలో వెనుకబడిందన్న విషయాన్ని పరోక్షంగా ప్రభుత్వం అంగీకిరించినట్లే నన్న వాదన వినవస్తున్నది. సీమాంధ్ర పాలనలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు నిర్లక్షానికి గురైన విషయం తెలిసిందే. ఆ కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. అయినా తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలు నిత్యం ఏదో ఒక సమస్య సాధనకోసం ఇంకా పోరాటం చేస్తున్న పరిస్థితి. కొన్ని సమస్యల పరిష్కారం రాష్ట్ర పరిధిలోవి కాగా, మరి కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవిగా ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రభుత్వాలు ఒకరినొకరు దోషులుగా పేర్కొంటు కాలయాపన చేస్తుండడంతో సమస్యలు నిత్య సమస్యలుగానే ఉండిపోతున్నాయి.

ఇక ప్రత్యేకంగా మునుగోడు చాలాకాలంగా ఈ నియోజకవర్గం ఏమేరకు నిర్లక్ష్యానికి గురైందన్న విషయం ఇక్కడి ఉప ఎన్నిక సందర్భంగా పలు గ్రామాల్లోని ప్రజలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడి సమస్యలు ఎందుకు పరిష్కరింపబడలేదన్న వాదన ఉంది. గత ఎన్నికలో ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించడంవల్లే తమ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఎన్నికల సందర్భంగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపణ చేస్తున్నాయి.. అయితే ఈ నియోజకవర్గ అభివృద్ధికోసం అనేక పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి, సంబందిత• అధికారులకు లేఖలు రాసినప్పటికీ లాభంలేకపోయిందని నిన్నటి వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపణ కూడా. అంతేకాదు తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలవడానికి అనేక సార్లు ప్రయత్నిస్తే ఆయన ఏనాడు తనకు సమయం కేటాయించకపోవడంతో విసుగు చెందానని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి ఆ కారణంగానే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వొచ్చిందని చెబుతూ వొచ్చిన విషయం తెలియందికాదు. కనీసం తన రాజీనామా వల్లనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అవుతుందని, ఆ విధంగానైనా ఈ నియోజకవర్గం బాగుపడుతుందన్న ఆశాభావంతోనే రాజీనామా చేసినట్లు ఎన్నికల సందర్భంగా ఆయన పలుపార్లు చెప్పుకొచ్చారు. ఆ విధంగానైనా నియోజకవర్గం బాగుపడితే తనకు అంతకన్నా కావాల్సింది ఏమున్నదన్న భావాన్ని ఆయన వ్యక్తపర్చారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ మంత్రులకన్నా సీమాంధ్రప్రాంత మంత్రులు తమ నియోజకవర్గాలకు అధిక నిధులను సమకూర్చుకోవడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉండే వారు.

కనీసం తెలంగాణ ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి ఉండదని అనుకున్నారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పోలిస్తే మిగతా నియోజకవర్గాలు లేదా జిల్లాల పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఇక మునుగోడ విషయానికి వొస్తే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పార్టీపై పడింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర ఐటి శాఖమంత్రి దత్తత తీసుకుంటానని చెప్పారు. ఆ మాట ప్రకారం వొచ్చే కొద్ది రోజుల్లో మునుగోడు సిరిసిల్లగా మారుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. తమ యావత్‌ ‌శక్తినంతా ఒడ్డి గెలిచిన సంతోషంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాల్సిందిగా అధికారులను, సంబంధిత• మంత్రులను ఆజ్ఞాపించారు. ముఖ్యంగా ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఊరూరా పర్యటించిన మంత్రులు, శాసనసభ్యులు, తదితర నాయకుల దృష్టికి వొచ్చిన సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అలాంటి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆజ్ఞాపించారు. అయితే కేవలం ఒక్క మునుగోడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని సూచిస్తూ, ఎప్పటిలానే తన సహజ ధోరణిలో తానే స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. గతంలో కూడా వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా తానే కుర్చీవేసుకుని పనులు పర్యవేక్షిస్తానన్న ముఖ్యమంత్రి ఎప్పుడు కూర్చుంటాడోనని ఆయా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *